Devadasi Dancers Tawaifs: ఉత్తరాదిన తవాయిఫ్‌లు, దక్షిణాదిన దేవదాసీలు, బెంగాల్‌లో బైజీలు.. ఇలా పేర్లు ఏవైనా.. భారతీయ సంప్రదాయ సంగీతం, నాట్య కళలను కాపాడటంతోపాటు దేశాన్ని రక్షించడానికి వారు చేసిన ప్రయత్నాలు చరిత్ర పుటల్లో మరుగునపడి పోయాయి. 1857లో భారతీయ సిపాయిలు కాన్పుర్ కోటను ముట్టడించినప్పుడు వారి వెంట నడిచిన వారిలో నాట్యగత్తెలూ ఉన్నారు. యుద్ధంలోనూ వారు తుపాకులు, కత్తులతో విరుచుకుపడ్డారు. రాజాశ్రయంలో ఉంటూ సంపద, పేరు, ప్రతిష్ఠలతో కొనసాగిన నాట్యగత్తెలకు సమాజంలోనూ గౌరవం, హోదా ఉండేది. అత్యధిక పన్ను చెల్లించే వారిలో వీరు అగ్రభాగంలో ఉండేవారు. ఆంగ్లేయులు క్రమంగా సంస్థానాలపై పెత్తనం చెలాయించటం ఆరంభించాక వీరి ప్రాభవం తగ్గటం ఆరంభమైంది. బ్రిటిష్ వారు ఈ నాట్యగత్తెలను, నాట్యాన్నీ చిన్నచూపు చూస్తూ బజారు మహిళలుగా భావించసాగారు. సంస్థానాధీశులు వీరికి పెద్దపీట వేయటం తెల్లవారికి నచ్చలేదు. ఇది నాట్యగత్తెల్లో ఆందోళనకు దారితీసింది. అదే సమయంలో ఆంగ్లేయులపై రగులుతున్న సిపాయిలకు వీరు తోడయ్యారు. అనేక సందర్భాల్లో సిపాయిల రహస్య సమావేశాలకు, ప్రణాళికల రచనకు, ఆయుధాలు, సమాచార సరఫరాకు నాట్యగత్తెల ఇళ్లే కేంద్రాలయ్యాయి. ఆంగ్లేయులపై తిరుగుబాటుకు ఆర్థికంగానూ సాయం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్రిటిష్ సర్కారు... తిరుగుబాటును అణచివేశాక... నాట్యగత్తెల జీవితాలను, సంప్రదాయాలను, కళలను చిదిమివేసింది. వారి ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకుంది. వారి ఇళ్లను వ్యభిచార గృహాలుగా ముద్రవేసింది. చాలామంది నాట్యగత్తెలను సిపాయిల కంటోన్మెంట్లలో వ్యభిచారులుగా మార్చింది. భారత్‌లో ఏళ్ల తరబడి ఏకాకులుగా జీవించిన అనేకమంది బ్రిటిష్ అధికారులు ఈ నాట్యగత్తెలను తమ వినోదానికి వాడుకునే వస్తువులుగా భావించారు.
వీటికి తోడుగా... 1858 తర్వాత బ్రిటన్ నుంచి ఆంగ్లంతో పాటు సాంస్కృతిక భావనలు కూడా దిగుమతయ్యాయి. మనను సంస్కరిస్తున్నామనే పేరుతో ఆంగ్లేయ భావజాలాన్ని రుద్దటం పెరిగింది. ఆ ప్రభావంతో మన సంప్రదాయాలు, కళలను కించపర్చుకోవటం, చిన్నచూపుచూడటం, తప్పుడు అర్థాలు కల్పించుకోవటం మొదలైంది. 1890లో ప్రిన్స్ అల్బర్ట్ విక్టర్‌కు నాట్యగత్తెలతో స్వాగతం పలికారు. దీనిపై అప్పటి బ్రిటిష్ ప్రచారకర్త రెవరెండ్ మర్దోక్ సారథ్యంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయ సంప్రదాయాలు, నాట్యగత్తెలు, నాట్యకళలను కించపరుస్తూ మర్దోక్ అనేక వ్యాసాలు రాశాడు. నాట్యగత్తెలు వచ్చే కార్యక్రమాలకు మీ భర్తలు వెళ్లకుండా కట్టడిచేయండి అంటూ ఆంగ్లేయ మహిళలకు కరపత్రాలు పంచి పెట్టాడు. భారత్‌లోని కొంతమంది సంస్కరణ వాదులు, ఆంగ్ల పత్రికలు దీనికి మద్దతు పలకడం గమనార్హం. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మిస్ టెనెంట్ ఏకంగా నాట్యగత్తెలను బహిష్కరించాల్సిందిగా విద్యావంతులైన భారతీయులకు పిలుపునిచ్చింది. మహిళలను కించపరుస్తున్న భారతీయ సంప్రదాయాలంటూ... ఉద్యమాలు మొదలెట్టారు. 1890ల్లోని యాంటీనాచ్ ఉద్యమం ఆ కోవకు చెందిందే. మొత్తానికి అధికారిక కార్యక్రమాల్లో నాట్యగత్తెల నాట్యం లేకుండా చేయగలిగారు.