కొవిడ్ ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా ప్లస్ వైరస్‌కు ఊపిరితిత్తుల కణజాలంతో ఎక్కువ సంబంధం ఉంటోందని కరోనా వర్కింగ్ గ్రూప్(నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్-NTAGI) ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోడా పేర్కొన్నారు. అయితే, వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోందనేందుకు ఇది కారణం కాదని అన్నారు. మరిన్ని కేసులు వెలుగులోకి వస్తేనే ఈ వేరియంట్ ప్రభావంపై స్పష్టత వస్తుందని అన్నారు. కరోనా టీకా(ఒక్క డోసు అయినా) తీసుకున్నవారిలో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉందని చెప్పారు.
"ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఊపిరితిత్తుల శ్లేష్మ పొరకు, డెల్టా ప్లస్ వైరస్‌కు ఎక్కువ సంబంధం ఉంది. కానీ ఇది ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే దీనర్థం.. వ్యాధి తీవ్రంగా ఉంటుందనో, వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనో మాత్రం కాదు."
-ఎన్కే అరోడా, కరోనా వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్
డెల్టా ప్లస్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అరోడా అభిప్రాయపడ్డారు. లక్షణాలు లేని వారిలోనూ ఈ వైరస్ ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. వైరస్ జన్యు పర్యవేక్షణ వేగంగా జరగాలని అన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించేందుకు కొన్ని రాష్ట్రాలు జిల్లా స్థాయిలో ప్రణాళికలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అయితే, డెల్టా ప్లస్ మూడో దశ కరోనా వ్యాప్తికి కారణమవుతుందా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.