Delhi weekend curfew: ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో దావానలంలా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి జారుకుంటున్నాయి.
వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. బస్సులు, మెట్రోలో 50శాతం సామర్థ్యం ఉండటం వల్ల రద్ధీ బాగా పెరిగిందని, అందుకే సీటింగ్ సామర్థ్యాన్ని తిరిగి 100శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. మాస్క్ ధరించిన వారికే ప్రవేశమని స్పష్టం చేశారు. ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో పని చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. దిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిటి సిఫారసుకు అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు మనీశ్.
Punjab night curfew
వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో పంబాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పురపాలక ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. బార్లు, సినిమా హాళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, స్పాలు 50 శాతం సామర్థ్యంతోనే నడవాలని ఆదేశించింది. జిమ్‌లను పూర్తిగా మూసివేసింది. టీకా రెండు డోసులు తీసుకుంటేనే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు విధులకు హాజరుకావాలని సూచించింది.