దేశ రాజధాని దిల్లీలో ఘోరం జరిగింది. చదువు చెప్పాల్సిన టీచరే.. ఓ విద్యార్థినిని మొదటి అంతస్తు కిటికీ నుంచి కిందికి విసిరేసింది. తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్.. కత్తెర్లతో దాడి చేసి.. - విద్యార్థినిపై అటాక్ చేసిన టీచర్ న్యూస్
దిల్లీలో విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిని తన స్కూల్ టీచర్.. మొదటి అంతస్తు కిటికీ నుంచి కిందికి విసిరేసింది. అంతకుముందు కత్తెర్లతో దాడి చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ దిల్లీ పాఠశాలలో బాధిత విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది. ఏమైందో తెలియదుగానీ, కిటికీ లోంచి ఆమెను విసిరేయడానికి ముందు విద్యార్థినిపై టీచర్ కత్తెర్లతో దాడి చేసింది. గమనించిన సహచర ఉపాధ్యాయిని ఒకరు ఆమెను వారించే ప్రయత్నం చేసింది. అయినా వినకుండా కోపంతో విద్యార్థినిని కిటికీలోంచి బయటకు విసిరేసింది. దీంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడి పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చిన పోలీసులు నిందితురాలిని కస్టడీలోకి తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేశారు.