Delhi Pilot Couple Thrashed : ఇంట్లో పనిచేసే మైనర్‌ను హింసించిన ఓ మహిళా పైలట్, ఆమె భర్తపై బాధితురాలి బంధువులు దాడి చేశారు. దిల్లీలోని ద్వారక ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది.
ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో పనిచేసే దంపతులు.. 2నెలల కిందట పదేళ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఈ ఉదయం బాలికను చూసేందుకు వచ్చిన ఆమె బంధువు.. చిన్నారి శరీరంపై గాయాలను గుర్తించారు. చిన్నారిని హింసించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు మహిళా పైలట్ ఇంటికి వచ్చి గొడవకు దిగారు. దంపతులిద్దర్నీ వీధిలోకి లాగి దాడికి దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మైనర్‌ను పనిలో పెట్టుకున్నందుకు కేసు నమోదు చేయడం సహా మహిళా పైలట్, ఆమె భర్తను అరెస్టు చేశారు. నిందితులను కౌశిక్ బాగ్చి (36), పూర్ణిమ బాగ్చి (33)గా గుర్తించారు.
ఇంటి పనులు సక్రమంగా చేయడం లేదని మైనర్‌ను పైలట్ దంపతులు తరచుగా తిట్టేవారని బాధితురాలి బంధువు ఆరోపించారు. బాలికను పూర్ణిమ.. బుధవారం ఉదయం కొట్టడం తాను చూశానని చెప్పారు. బాధితురాలు బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన బాలిక అని పేర్కొన్నారు.
10ఏళ్ల మైనర్ పనిమనిషిపై చిత్రహింసలు.. పైలట్ దంపతులపై దాడి Delhi Pilot Domestic Help : బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని ద్వారకా డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. 'పైలట్ దంపతులు పనిమనిషిగా నియమించుకున్న బాలిక వయసు 10 ఏళ్లు మాత్రమే. మేము ఘటనాస్థలి వెళ్లి.. బాలికకు వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రికి తరలించాం. ఆమె శరీరంపై కొన్ని కాలిన గాయాలున్నాయి. పైలట్ దంపతులపై కేసు నమోదు చేశాం. వారిద్దరినీ అరెస్ట్ చేశాం. మైనర్‌కు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నిందితులను కౌశిక్ బాగ్చి, అతడి భార్య పూర్ణిమ బాగ్చిగా గుర్తించాం. పూర్ణిమ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తుండగా.. ఆమె భర్త మరో ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నాడు.' అని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.
10 ఏళ్ల మైనర్‌పై దాడిని దిల్లీ మహిళా చీఫ్ స్వాతి మాలివాల్ స్పందించారు. 'మైనర్‌ను ఇంటి పనిమనిషిగా పెట్టుకుని ఆమెను క్రూరంగా హింసించినవారిని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు సమాధానం ఇవ్వాలి.' అని స్వాతి మాలివాల్ కోరారు.
Indigo Pilot Thrashed : మైనర్ పనిమనిషిని ఇద్దరు పైలట్ దంపతులు క్రూరంగా హింసించారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. 10 ఏళ్ల మైనర్‌పై దాడి చేసినందుకు ఒక పురుష ఉద్యోగిని తొలగించామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు.