తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ మేయర్ పీఠం ఆప్​ సొంతం.. 34 ఓట్ల తేడాతో భాజపాపై విజయం

దిల్లీ మేయర్​ పీఠాన్ని ఆమ్​ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఓబెరాయ్ విజయం సాధించారు. ఆమెకు పార్టీ ముఖ్య నేతలు అభినందనలు తెలిపారు.

delhi mayor election
దిల్లీ మేయర్ ఎన్నిక

By

Published : Feb 22, 2023, 2:33 PM IST

Updated : Feb 22, 2023, 3:18 PM IST

తీవ్ర ఉత్కంఠ మధ్య దిల్లీ నగరపాలిక పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. 15ఏళ్లపాటు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో ఓటమిపాలైంది. బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. భాజపా అభ్యర్థి రేఖా గుప్తాపై.. 34 ఓట్ల తేడాతో షెల్లీ విజయం సాధించారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సహా పలువురు ఆప్ నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు.

ఆప్ కౌన్సిలర్ షెల్లీ ఒబెరాయ్ దిల్లీ మేయర్​గా ఎన్నిక కావడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దిల్లీ ప్రజల విజయమని అన్నారు. 'చివరకు ప్రజలే గెలిచారు. గుండాలు ఓడిపోయారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​లో ప్రజలు గూండాయిజాన్ని ఓడించారు. దిల్లీ మేయర్​గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్​కు శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. మరోవైపు, తాను రాజ్యాంగబద్ధంగా పని చేస్తానని దిల్లీ మేయర్​గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులంతా హుందాగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

నామినేటెడ్‌ సభ్యులకు ఓటుహక్కుపై వివాదంతో 2నెలల వ్యవధిలో మేయర్‌ ఎన్నిక మూడుసార్లు వాయిదాపడింది. ఇటీవల ఆప్‌ మేయర్‌ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా తీర్పు అనుకూలంగా వచ్చింది. నామినేటెడ్‌ సభ్యులకు ఓటుహక్కు ఉండదని ఈనెల 17న రూలింగ్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు.. 24 గంటల్లో మేయర్‌ ఎన్నిక తేదీ ప్రకటించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈనెల 22న మేయర్‌ ఎన్నిక నిర్వహించాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా ఆమోదం తెలిపారు.

డిసెంబర్‌లో జరిగిన దిల్లీ నగరపాలిక ఎన్నికల్లో 250 డివిజన్లకు 134 చోట్ల ఆప్‌ అభ్యర్థులు గెలుపొందారు. గత అనుభవాల దృష్ట్యా మేయర్‌ ఎన్నిక సందర్భంగా దిల్లీ నగరపాలిక కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఓటింగ్‌కు గంటన్నరసేపు కేటాయించినట్లు ప్రిసైడింగ్‌ అధికారి సత్య శర్మ తెలిపారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

Last Updated : Feb 22, 2023, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details