మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కస్టడీని మరో 3 రోజులు పొడిగించాలన్న CBI అభ్యర్థనపై తీర్పునిచ్చింది ప్రత్యేక కోర్టు. మరో రెండు రోజులు సీబీఐ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సిసోదియా కస్టడీ శనివారంతో ముగియగా, ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి.. మరో మూడు రోజులు పొడిగించాలని CBI కోరింది. సీబీఐ అభ్యర్థనను.. సిసోదియా న్యాయవాది వ్యతిరేకించారు. దర్యాప్తులో CBI అసమర్థత కారణంగా రిమాండ్‌ను పొడిగించాలని కోరడం సరికాదన్నారు. నిర్దోషిగా నిరూపించుకోవాలని సిసోదియాను పదేపదే కోరడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణకు సహరించడం లేదని చెప్పడాన్ని ఆక్షేపించిన సిసోదియా న్యాయవాది ఆ కారణంగా రిమాండ్ గడువు పెంచాలని కోరడం సరికాదన్నారు. మరోవైపు బెయిల్ పిటిషన్‌పై మార్చి 15న విచారణ జరపాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. దీనిని సిసోదియా తరఫు న్యాయవాది వ్యతిరేకించడం వల్ల మార్చి 10కి వాయిదా వేసింది కోర్టు.
దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో.. మద్యం తయారీ దారులు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు లబ్ది చేకూరే విధంగా వ్యవహరించారనే ఆరోపణలతో మనీశ్ సిసోదియా అరెస్టు చేశారు. మద్యం విధానం రూపొందించే సమయంలో.. మద్యం తయారీ దారులు, వ్యాపారులు తమకు అనుకూలంగా ఉండే అంశాలను చర్చించి చేర్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం విధానం అధికారికంగా విడుదల చేయకముందే.. డాక్యుమెంట్ మద్యం వ్యాపారుల వాట్సప్ గ్రూప్ లో ప్రత్యక్షమైందన్న సీబీఐ ఆరోపించింది. దీంతో పాటు.. వ్యాపారులు, తయారీ దారులు, ప్రభుత్వ పెద్దలు మధ్య జరిగిన చర్చల ఆధారాలు ధ్వంసం చేశారని సీబీఐ పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా.. గత ఆదివారం 8 గంటలకు విచారణ తర్వాత సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది.