యుమునా నదిలో కలిపే డీఫోమింగ్ రసాయనాల వల్ల నీరు కలుషితమవుతోందని భాజపా నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే స్పందించిన దిల్లీ జల్ బోర్డ్ డైరెక్టర్ సంజయ్ శర్మ.. భాజపా నేత విసిరిన సవాలును స్వీకరించారు. యమునా నది ఒడ్డున నిలబడి అదే నీటితో స్నానం చేసి.. ఆ నీటి వల్ల ఎటువంటి హాని లేదని చెప్పారు. యమునా నదిలో నురగను తగ్గించేందుకే ఈ రసాయనాలు వినియోగిస్తున్నామని.. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తయని ఆయన తెలిపారు. నీటిలో రసాయనాలు కలిపినప్పటి నుంచి ఎప్పటికప్పుడు యమునా జలాల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నామని పేర్కొన్నారు. దీని వల్ల నదిలోని జీవరాశులకు ఎటువంటి హాని జరగట్లేదని.. అంతే కాకుండా నదిలోని చేపలు ఇంకా మెరుగ్గా పెరుగుతున్నాయని సంజయ్ శర్మ తెలిపారు.
ఛత్ పూజకు ముందు నదిలో నురగను తొలగించేందుకు "విషపూరిత" రసాయనాన్ని ఉపయోగించారన్న ఆరోపణలను క్వాలిటీ కంట్రోల్ తోసిపుచ్చింది. "నేను మొదటి రోజు నుంచి చెబుతున్నాను. వాస్తవానికి, ఈ కెమికల్ నీటిలో కరిగి ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరుస్తుంది." అని దిల్లీ బోర్డ్ అధికారి సంజయ్ శర్మ తెలిపారు. విషపూరిత నురుగు ఏర్పడటానికి ప్రధాన కారణం మురుగునీటిలో అధిక ఫాస్ఫేట్ కంటెంట్ ఉండటమని.. ఇది అద్దకం పరిశ్రమలు, ధోబీ ఘాట్‌లు, గృహాల్లో ఉపయోగించే డిటర్జెంట్లు నుంచి వస్తున్నాయని తెలిపారు.