సైబర్ నేరాల తీరు రోజురోజుకీ మారిపోతోంది. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, పోలీసులు సైబర్ మోసాలపై ప్రజలను హెచ్చరిస్తున్నప్పటికీ.. అవగాహన లోపంతో కొందరు నష్టపోతున్నారు. అందుకే ఎస్సెమ్మెస్/మెయిల్ ద్వారా వచ్చే వెబ్ లింక్‌లను క్లిక్ చేయడం, ఓటీపీని ఇతరులకు షేర్ చేయడం వంటివి చేయొద్దని సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న మోసాల తీరు వీటికి భిన్నంగా ఉంది. కొద్దిరోజుల క్రితం ఫోన్ హ్యాక్ చేసి ఓ వ్యాపారి ఖాతా ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా ఓటీపీ అవసరం లేకుండా మిస్డ్‌కాల్‌తో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షల రూపాయల నగదు కొట్టేశారు.
సైబర్ నేరగాళ్ల మోసం.. ఒక్క మిస్డ్‌కాల్‌తో రూ.50 లక్షలు స్వాహా - సైబర్ క్రైమ్ న్యూస్ దిల్లీ
ఓటీపీ అవసరం లేకుండా మిస్డ్‌కాల్స్ ద్వారా ఓ వ్యక్తి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.50 లక్షల నగదును కొట్టేశారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో ఇది కొత్త తరహా మోసం అని పోలీసులు చెబుతున్నారు. అసలేం జరిగిందంటే?
దక్షిణ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి సెక్యూరిటీ సర్వీస్ సంస్థను నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సదరు వ్యక్తి ఫోన్‌కు రాత్రి 7 గంటల నుంచి 8:45 గంటల మధ్యలో పలుమార్లు మిస్డ్‌కాల్స్ వచ్చాయి. దీంతో వాటిలో కొన్ని కాల్స్‌ను లిఫ్ట్ చేయగా అవతలి నుంచి ఎవరు మాట్లాడకపోవడంతో, తర్వాత వచ్చిన వాటి గురించి పట్టించుకోలేదు. కొద్ది సమయం తర్వాత బాధితుడి ఫోన్‌కు ఆర్‌టీజీఎస్ ద్వారా నగదు బదిలీ అయినట్లు మెసేజ్ రావడం వల్ల పోలీసులను ఆశ్రయించాడు. మొత్తంగా రూ.50 లక్షలు బాధితుడి ఖాతా నుంచి బదిలీ అయినట్లు గుర్తించారు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఈ మోసానికి పాల్పడింది ఝార్ఖండ్ జాంతారా ప్రాంతానికి చెందిన సైబర్ నేరగాళ్లుగా అనుమానిస్తున్నారు. స్విమ్ స్వాప్ ద్వారా బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి నగదు కొట్టేసినట్లు తెలిపారు. బ్లాంక్ లేదా మిస్డ్‌కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్‌టీజీఎస్‌కు చెందిన ఓటీపీను యాక్టివేట్ చేసి, ఐవీఆర్ కాల్స్ ద్వారా వాటిని పొందుతారు. ఝార్ఖండ్‌లో జాంతారా ప్రాంతానికి చెందిన సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఈ తరహా మోసాలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు.