Delhi Assembly Panel Visit AP : దిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి, సీనియర్ అధికారులకు మధ్య వాగ్యుద్ధంనడుస్తుండగా.. ఆసక్తికరమైన పరిణామం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, దిల్లీ విజిలెన్స్ ప్రత్యేక కార్యదర్శి వైవీవీజే రాజశేఖర్ స్వగ్రామానికి ముగ్గురు ఆమ్ఆద్మీ ఎమ్మెల్యేలతో కూడిన అసెంబ్లీ కమిటీ వెళ్లడం చర్చనీయాంశమైంది. రాజశేఖర్ ఓబీసీ సర్టిఫికెట్‌ను ధ్రువీకరించేందుకు.. ఆంధ్రప్రదేశ్‌కు కమిటీ వెళ్లినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
దిల్లీ విజిలెన్స్ ప్రత్యేక కార్యదర్శి వైవీవీజే రాజశేఖర్.. 1994లో సివిల్స్ పరీక్షలు రాస్తున్న సమయంలో నకిలీ ఓబీసీ సర్టిఫికెట్ సమర్పించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. రాజశేఖర్ ఓబీసీ వర్గానికి చెందిన వారు కాదని ఫిర్యాదులో ఉంది. దీంతో DANICS (దిల్లీ అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీసెస్) అధికారి ప్రేమ్‌నాథ్.. ఈ ఏడాది జూన్‌లో రాజశేఖర్‌ను సస్పెండ్ చేశారు.
అయితే దిల్లీ ఓబీసీ సంక్షేమ కమిటీ.. రాజశేఖర్‌పై వచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంది. తన అభిప్రాయాన్ని తెలిపేందుకు కమిటీ ముందు హాజరుకావాలని రాజశేఖర్‌కు నోటీసు పంపింది. కానీ ఆయన కమిటీ ముందు హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం.. తనకు నోటీసులు పంపే అధికారం ఓబీసీ సంక్షేమ కమిటీకి లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ విషయంపై రాజశేఖర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో రాజశేఖర్ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ జరిపేందుకు ఆప్ ఎమ్యెల్యే మదన్‌లాల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సమీపంలో ఉన్న అనకాపల్లికి వెళ్లింది.