దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం(Delhi air pollution) తీవ్రత కొనసాగుతోంది. కాలుష్యం వల్ల చాలా మంది దిల్లీ వాసులు ఆస్పత్రుల పాలవుతున్నారు. పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. అయితే.. ఏటా నవంబరు-డిసెంబరు మధ్య కాలుష్యం భారీ స్థాయిలో నమోదవుతోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)(Nasa on delhi air pollution) వెల్లడించింది. దిల్లీ వాయు కాలుష్యానికి పరిశ్రమలు, వాహన కాలుష్యం, చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు కాల్చే పంట వ్యర్థాలు... బాణసంచా కాల్చడం వంటివి కారణమని తెలిపింది.
విజిబుల్ ఇన్ ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ స్యూట్ ద్వారా.. నవంబర్ 11న ఉన్న పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామీ ఎన్పీపీ శాటిలైట్ ద్వారా ఫొటోలు తీసింది. పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల భారీ ఎత్తున పొగ దిల్లీ వైపు మళ్లి, మరింత కాలుష్యం ఏర్పడడానికి కారణమని నాసా తెలిపింది.
"దిల్లీ కాలుష్యం వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు ఉంది. ఈనెల 11న పొగ వల్ల దాదాపు 2.2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నవంబర్ 12న దాని ప్రభావం మరింతగా ఉంది. థార్ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన దుమ్ము ధూళి, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం, టపాకాయల కాలుష్యం కూడా తీవ్రతకు కారణమయ్యాయి."