గళమెత్తుతున్నవారి నోరు మూయించడానికి వారిపై దేశద్రోహ కేసును బనాయించడం తగదని దిల్లీ అదనపు సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల నిరసనలపై ఫేస్‌బుక్‌లో నకిలీ వీడియోలను ఉంచి వదంతుల్ని వ్యాప్తి చెందిస్తున్నారనే ఆరోపణపై దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ధర్మేందర్ రాణా సోమవారం ఈ వ్యాఖ్య చేశారు. శాంతిభద్రతలు కొనసాగడానికి ప్రభుత్వం చేతిలో ఉన్న శక్తిమంతమైన ఆయుధం.. దేశద్రోహ చట్టమనీ, దానిని ఈ కేసులో మోపడం తీవ్ర చర్చనీయాంశమని అన్నారు.
దీప్ సిద్ధూ కస్టడీ పొడిగింపు
ఎర్రకోట ఘటనలకు సంబంధించి.. నటుడు, ఉద్యమకారుడు దీప్‌సిద్ధూకు మరో వారం పాటు పోలీసు కస్టడీ విధిస్తూ దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలిచ్చింది. ఇతర నిందితుల్ని గుర్తించడానికి వీలుగా నిందితుని కస్టడీని పొడిగించాలని పోలీసులు చేసిన వినతికి న్యాయమూర్తి అంగీకరించారు. ప్రజల్ని రెచ్చగొట్టడంతో పాటు అల్లర్లలో సిద్ధూ ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. సిద్ధూ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉందని వారు వివరించారు.
ఇదీ చదవండి :పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తొలగింపు