ఇద్దరు బాలికలను పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన మరవకముందే ఝార్ఖండ్ దుమ్కాలో మరో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఓ గిరిజన బాలిక.. ఓ చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. గడిచిన నెల రోజుల్లో ఇది నాలుగో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
బాధితురాలు అమగఛి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజలి సోరెన్ ప్రాంతంలో నివసిస్తుండగా.. శికారిపదలో పదో తరగతి చదువుతోంది. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడం వల్ల బాడ్తల్లాలోని బంధువు ఇంటికి వచ్చింది. శుక్రవారం తిరిగి ఇంటికి బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు.. బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. బుధవారం ఓ చెట్టుకు వెలాడుతూ బాలిక శవం కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇది హత్యా?.. ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
అంతకుముందు దుమ్కా జిల్లాలో 14 ఏళ్ల బాలిక సైతం ఇదే తరహాలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించింది. తర్వాత విచారించగా.. ఆమెపై అత్యాచారం చేసి.. హత్య చేశారని తేలింది. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు.
'ఇళ్లు కూల్చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం' :
బెంగళూరులో ఇటీవలి వరదలను దృష్టిలో పెట్టుకొని.. ఆక్రమణలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను బెదిరించేందుకు ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. కేఆర్ పురాలోని ఓ లేఅవుట్‌లో మూడు రోజులుగా బెంగళూరు మున్సిపల్ అధికారులు ఇళ్లను కూలగొడుతున్నారు. అయితే తమ ఇంటిని కూలగొడితే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని భార్యాభర్తలు బెదిరించారు. అయినప్పటికీ ఇంటిని ఖాళీ చేయించేందుకు అధికారులు యత్నించగా.. భార్యాభర్తలు ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించారు.
వెంటనే నగరపాలక సిబ్బంది, స్థానికులు వారిపై నీళ్లు పోసి కాపాడారు. కొన్ని దశాబ్దాలుగా తాము ఇక్కడే నివసిస్తున్నామని, అధికారులు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా బలప్రదర్శన చేస్తున్నారని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని, రూ.40 లక్షలు ఖర్చుచేసి ఇల్లు నిర్మించుకున్నామని అధికారులతో వాదించారు. అయితే, కూలగొట్టే విషయంలో చట్టప్రకారం ముందుకెళతామని అధికారులు తేల్చిచెబుతున్నారు.