sputnik v light vaccine: దేశంలో మరో సింగిల్ డోసు కరోనా వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ. దేశంలో కరోనాపై పోరుకు ఇది మరింత దోహదపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.
తాజా అనుమతులతో దేశంలో అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్న టీకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ (సింగిల్ డోస్ టీకా), జైడస్ క్యాడిలా, కొవొవాక్స్, కార్బెవాక్స్లకు ఇప్పటికే అనుమతులు లభించాయి.
స్పుత్నిక్ లైట్ టీకా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐకి జనవరి 31న సిఫార్సు చేసింది నిపుణుల కమిటీ. రెండు డోసుల స్పుత్నిక్ వి టీకాను రూపొందించిన.. రష్యా సంస్థ ఆర్డీఐఎఫ్(రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) ఒకే డోసు స్పుత్నిక్ లైట్ టీకాను కూడా అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ లైట్ టీకా ట్రయల్స్‌ను.. భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ చేపట్టింది.