ఆ యువకుడికి అమెరికాలో ఉద్యోగం.. రూ.కోట్లతో జీతం.. కానీ అవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే అలాంటి ఆడంబరమైన జీవితాన్ని వదులుకుని.. నిరాండంబర జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యాడు. అతడే మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన ప్రన్సుఖ్ కాంతేడ్(28). డిసెంబర్ 26న జినేంద్ర ముని వద్ద జైన సన్యాస దీక్ష తీసుకోకున్నాడు మన్సుఖ్. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సాధువులు హాజరుకానున్నారు. అదే రోజు మన్సుఖ్తో పాటు మరో ఇద్దరు యువకులు సన్యాస దీక్షను స్వీకరించనున్నారు.
సన్యాసిగా మారనున్న యువ సైంటిస్ట్.. అమెరికాలో రూ.కోట్ల జీతం వదిలి ఆధ్యాత్మికం వైపు అడుగులు
రూ.కోట్లలో జీతం, పెద్ద ఉద్యోగాన్నిసైతం వదులుకుని జైన సన్యాసిగా మారేందుకు సిద్ధమయ్యాడు ఓ యువకుడు. అతడే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రన్సుఖ్ కాంతేడ్. ఆ యువకుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఓ సారి తెలుసుకుందాం.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రన్సుఖ్.. 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర చదివిన తర్వాత డేటా సైంటిస్ట్‌గా స్థిరపడ్డాడు. అతడి జీతం ఏడాదికి అక్షరాలా రూ.1.25 కోట్లు. అయితే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రన్సుఖ్.. జైన సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నాడు. దీంతో 2021 జనవరిలో అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చేశాడు.
'శాశ్వతమైన ఆనందం కోసం నేను జైన సన్యాసి కాబోతున్నాను. చిన్నప్పటి నుంచి సన్యాసి కావాలన్న కోరిక నెరవేరబోతుంది' అని ప్రన్సుఖ్ అన్నాడు. తమ కుమారుడు జైన సన్యాసి కాబోతుండడంపై అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.