అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి మే 17న సాయంత్రం నాటికి గుజరాత్ తీరానికి సమీపిస్తుందని అంచనా వేసింది. మే 18 తెల్లవారుజామున పోర్బందర్, మహువా ప్రాంతాల వద్ద తీరం దాటుతుందని తెలిపింది.
గోవాలోని పనాజీకి నైరుతి వైపు 150 కిమీ, ముంబయికి దక్షిణ దిశగా 490 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతమైందని ఐఎండీ వెల్లడించింది. మే 18 తెల్లవారుజామున గుజరాత్‌లోని పోర్బందర్, మహువా వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది.
అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో కేరళలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొంకణ్, గోవా, ఘాట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గుజరాత్‌లో స్వల్ప స్థాయి నుంచి మోస్తరు వర్షాలు, సౌరాష్ట్ర, కచ్, డయ్యూ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. దక్షిణ రాజస్థాన్‌కు సైతం వర్ష సూచన ఉందని పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. చేపల వేటపై నిషేధం ఉందని గుర్తు చేసింది.
వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం
మరోవైపు, తుపాను ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత వాయుసేన ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 16 రవాణా విమానాలు, 18 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది.
పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. తుపాను సహాయక చర్యల కోసం 53 బృందాలను నియమించినట్లు చెప్పారు. 24 బృందాలను ఇప్పటికే ఐదు రాష్ట్రాలకు పంపించగా.. 29 టీమ్‌లను స్టాండ్‌బైగా ఉంచినట్లు వివరించారు.