తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బయటి వ్యక్తికి కీలక బాధ్యతలా'? ఇక అంతా వారి చేతుల్లోనే..!

ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేస్తూ.. విజయాలను కేరాఫ్​గా మార్చుకున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ (Prashanth Kishor)..​ కాంగ్రెస్​లో చేరుతారన్న వార్త కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. వీటికి బలం చేకూరుస్తూ ఆయన ఇటీవల.. కాంగ్రెస్​ కీలక నేతలను కలిశారు కూడా. అయితే.. ఆయన రాకపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా.. జీ-23 వర్గం పీకేను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చేసేదేం లేక ఆ బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించింది అధిష్ఠానం​. మరి పార్టీ​ అత్యున్నత నిర్ణాయక సంస్థ ఏం నిర్ణయం తీసుకోనుంది? కాంగ్రెస్​లోకి పీకే ఎంట్రీ ఖాయమా? అదే జరిగితే.. దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి?

ప్రశాంత్
ప్రశాంత్

By

Published : Sep 5, 2021, 2:07 PM IST

Updated : Sep 5, 2021, 2:14 PM IST

ప్రశాంత్‌ కిశోర్‌(Prashanth Kishor).. పరిచయం అక్కర్లేని తాజా రాజకీయ సంచలనం. పదునైన వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలతో పార్టీలను అవలీలగా అందలం ఎక్కించగల వ్యూహకర్త. పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్​కు చెందిన ఐ-ప్యాక్ సంస్థ పనితీరుకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ ఏడాది బంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం 'ఎన్నికల వ్యూహరచన' నుంచి తప్పుకోనున్నట్లు ప్రశాంత్ ప్రకటించారు. అప్పట్లో భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించని ఆయన.. రాజకీయ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్​లో చేరి మరింత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన చేరికపై కాంగ్రెస్​ సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్​ కిశోర్​ 2014 లోక్​సభ ఎన్నికలకు (Loksabha Election 2014) ముందు భాజపాతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జేడీయూలో చేరారు. కొంతకాలం పాటు ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగానూ ఉన్నారు. ఇటీవలే పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారు పదవికి రాజీనామా చేశారు.

ప్రశాంత్ కిశోర్​

ఐ-ప్యాక్​తో మ్యాజిక్..

ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు తగినట్లు రాజకీయ వ్యూహాలు రచించే సంస్థగా ఐ-ప్యాక్​కు మంచి పేరుంది. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలకు సలహాలు, సూచనలు అందించే ఈ సంస్థ.. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఆయా పార్టీలకు విజయాలను అందిస్తోంది. 2014 సార్వత్రికంలో నరేంద్రమోదీ ప్రచార సరళిని 'పీకే' నేతృత్వంలోని ఈ సంస్థే రూపొందించింది. 2015 బిహార్​ ఎన్నికల్లో నితీశ్ కుమార్​, 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్​మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు కావడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికలతో.. బంగాల్​లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే.స్టాలిన్ అధికారంలోకి రావడానికి తిరుగులేని రాజకీయ వ్యూహాలు రచించిందీ ఈ సంస్థే.

నల్లేరు మీద నడకే..

ఇక వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్​ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే 'పీకే'కు పార్టీలో కీలక పదవిని అప్పగించాలని కాంగ్రెస్​ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు.. ప్రియాంక గాంధీ వాద్రాతోనూ ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. తిరుగులేని రాజకీయ వ్యూహకర్తగా పేరున్న పీకే రాకతో పార్టీ విజయం నల్లేరు మీద నడకేనని కొందరు సీనియర్లూ భావిస్తున్నారట.

తేల్చనున్న సీడబ్ల్యూసీ..

కాంగ్రెస్‌లో (Congress Politics) ప్రశాంత్ కిశోర్‌ చేరిక లాంఛనమే అనుకున్న తరుణంలో పార్టీలో ఆయన​కు కట్టబెట్టాల్సిన స్థానంపై సీనియర్ల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా పార్టీలోకి ఆయన రాకపై జీ-23 వర్గం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత కారణంగా అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి (సీడబ్ల్యూసీ) ఈ బాధ్యతను అప్పగించింది కాంగ్రెస్.

వాటిపైనే చర్చలు..

సీడబ్ల్యూసీ(CWC) సభ్యులైన ఏకే ఆంటోనీ, అంబికా సోని, కేసీ వేణుగోపాల్​తో కూడిన ఈ కమిటీ.. ప్రశాంత్​ కిశోర్​ చేరికతో పార్టీలో అవసరమైన మార్పులు, భవిష్యత్​లో 'పీకే' సూచనలు కాంగ్రెస్‌పై ఏ మేరకు ప్రభావితం చూపిస్తాయనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సార్వత్రిక ఎన్నికలకు(General Elections) ముందు పార్టీలో చేపట్టాల్సిన మార్పుల గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఈ నివేదికను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి(Sonia Gandhi) సమర్పించనుంది.

బయటి వ్యక్తికా..?

ఎన్నికల వ్యూహాలు, పొత్తులకు సంబంధించిన బాధ్యతను తనకివ్వాల్సిందిగా ప్రశాంత్ కిశోర్.. రాహుల్ గాంధీ వద్ద ప్రతిపాదించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకునే హక్కు 'బయటి వ్యక్తి'కి ఇవ్వడం ప్రమాదకరమని సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణానికి డిమాండ్ చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన జీ-23 వర్గంలోని మెజారిటీ నేతలు ప్రశాంత్ కిశోర్‌కు పార్టీలో కీలక బాధ్యత ఇవ్వకూడదని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ కమిటీకి జీ-23 వర్గం ఏ మేరకు సహకరిస్తుందన్నది వేచిచూడాల్సిందే.

'ముఖ్యమైన అంశాలను పార్టీ సభ్యులతో చర్చించడం అవసరం. మాలో చాలా మంది అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు. మమ్మల్ని సంప్రదించాలి. మా అభిప్రాయాలు తీసుకోవాలని' పీకే చేరికపై సీనియర్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. మొత్తంగా ప్రశాంత్ కిశోర్ చేరికపై కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పీకే వ్యూహం సిద్ధం..?

ఇప్పటికే భాజపాను ఓడించడానికి ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన కొన్ని సూచనలపై కొందరు సీనియర్లు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా కనీసం 136 సీట్లను గెలవాల్సి ఉంటుందని, ఇతర పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రధానం కాదని, అన్ని పార్టీలు ఏకం కావడం ముఖ్యమని సూచించారు. ఇందులో భాగంగానే ఆయన శరద్‌ పవార్‌, లాలూ ప్రసాద్‌, సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌ తదితరులతో భేటీ అయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 5, 2021, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details