CWC Meeting Congress : 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ నెల 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్ గాంధీ యాత్రపై CWC భేటీలో చర్చించనున్నారు. పాదయాత్ర సహా హైబ్రిడ్ మోడ్‌లో ఈ యాత్రను నిర్వహించనున్నారు. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానుంది. ఈ నెల 19న విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా రెండు రోజుల తర్వాత CWC భేటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 19న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విపక్షాల కూటమి నాలుగో భేటీలో సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు "మే నహీ, హమ్" (నేను కాదు మేము) అనే నినాదంతో పార్టీలు ముందుకు సాగాలని భావిస్తున్నాయి.
కాంగ్రెస్ ఓటమిని ఊహించలేదు : చిదంబరం
Chidambaram on 2023 Election Results : ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఊహించలేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం. ఇది పార్టీకి ఆందోళనకర అంశమని చెప్పారు. ప్రతి ఎన్నికనూ తుది సమరంలా భావిస్తూ బీజేపీ పోరాడుతోందని, ఈ విషయాన్ని విపక్షాలు గ్రహించాలని సూచించారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.