దేశ జనాభా అప్రతిహతంగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం 133.89 కోట్లకు చేరింది. కన్నుతెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం అన్నట్లుగా దేశంలో జనన, మరణాలు పెరిగిపోతున్నాయి. నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది కన్నుమూస్తున్నారు. మొత్తంమీద నికరంగా దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన (రిజిస్టర్డ్) జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా తాజా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది.
- ఏడాది (2019) వ్యవధిలో దేశంలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించగా మరణాలు 83 లక్షలున్నాయి.
- దేశంలో నమోదైన జననాల్లో 81.2 శాతం ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగాయి.
- మొత్తం 83.01 లక్షల మరణాల్లో 34.5 శాతం మందికి మరణించే సమయంలో ఎలాంటి వైద్య సదుపాయం అందలేదు. ఇవన్నీ సహజ మరణాలుగా నమోదయ్యాయి. ఆసుపత్రుల్లో చేరి వైద్యం పొందుతూ సంభవించిన మరణాలు 32.1 శాతమున్నాయి. ఇతర కారణాలతో మిగతా మరణాలు వాటిల్లాయి.
- పుట్టిన వెంటనే కన్నుమూసిన శిశు మరణాలు 1,65,257 కాగా ఇందులో 75.5 శాతం పట్టణాల్లో, మిగిలిన 24.5 శాతం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణ జనాభా 3.72 కోట్లు, ఏపీలో 5.23 కోట్లుగా ఉందని జన గణన విభాగం వెల్లడించింది.