Cube Solving Record :పంజాబ్‌లోని బఠిండాకు చెందిన ఓ విద్యార్థిని.. ఒకటి నుంచి 50 మ్యాథ్స్ క్యూబ్‌లను రెండు నిమిషాల్లోనే టకాటకా చెప్పేస్తోంది. తన అరుదైన ప్రతిభతో ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన బాలిక.. తాజాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది.
బఠిండాకు చెందిన 15 ఏళ్ల బాలిక అపేక్ష.. స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి గణిత శాస్త్రం అంటే ఎంతో ఇష్టపడే అపేక్ష.. అందరిలో కాస్త ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా సాధన చేసి క్యూబ్‌లను సెకన్లలోనే పరిష్కరిస్తోంది. ఒకటి నుంచి 50 క్యూబ్‌లను కేవలం రెండు నిమిషాల్లోనే చెప్పేస్తున్న ఆ బాలిక.. 2022లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, పతకాన్ని సైతం అందుకుంది.
తల్లిదండ్రులే మార్గదర్శకులు!
రోజూ 7-8 సార్లు రెండు గంటల పాటు సాధనం చేస్తానని అపేక్ష తెలిపింది. ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులు ప్రాక్టీస్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని చెప్పింది. ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తుంటారని పేర్కొంది. తాను భవిష్యత్తులో వైద్యురాలిగా సేవలు అందించాలనుకుంటున్నట్లు తెలిపింది.