CRPF soldiers in marriage: అమర జవాను సోదరి వివాహానికి సహచర సైనికులే పెళ్లి పెద్దలయ్యారు. పెళ్లి పనులు చేసి ఆమెకు అన్నలేని లోటును తీర్చారు. సీఆర్పీఎఫ్ 110వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్.. గతేడాది అక్టోబర్ 5న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడయ్యారు. కుంటుంబానికి ఆయన లేని లోటు తీర్చలేనిది. అయితే.. సహచర సైనికులు అన్నీ తామై శైలేంద్ర చెల్లెలి పెళ్లి తంతును పూర్తి చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలిలో రెండు రోజుల క్రితం జరిగిన శైలేంద్ర ప్రతాప్ సింగ్ చెల్లెలు జ్యోతి పెళ్లికి పదుల సంఖ్యలో సైనికులు హాజరయ్యారు. వచ్చామా, పెళ్లి చూసుకుని వెళ్లామా అన్నట్టు కాకుండా పెళ్లి కూతురికి అన్నలేని లోటును తీరుస్తూ వివాహ తంతు మొత్తం సవ్యంగా జరిగేలా చూశారు. అన్న మాదిరిగా ఆశీర్వదించి కానుకలు అందజేశారు.
యూనిఫామ్‌లో జవాన్లు పెళ్లి మండపానికి చేరుకున్న క్రమంలో అక్కడ ఉన్నవారు భావోద్వేగానికి గురయ్యారు. అన్న చేయాల్సిన పనులు సైనికులు చేస్తుంటే చూస్తున్న అక్కడి వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఈ పెళ్లి వేడుక ఫొటోలను ఆ మరుసటి రోజున సీఆర్పీఎఫ్ ట్విట్ చేసింది. దివంగత సైనికుడు ప్రతాప్ సింగ్ సోదరి జ్యోతి వివాహ వేడుకకు అన్నయ్యలుగా సైనికులు హాజరయ్యారని పేర్కొంది. దీనికి మరణించినా.. మర్చిపోలేదు అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది.