Cow dung cakes: విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు.. పెద్ద పెద్ద పుస్తకాలతో కుస్తీ పడుతూ.. ప్రయోగాలు చేస్తూ ఉంటారని అందరికీ తెలుసు. అయితే, వారు పిడకలు ఎలా చేయాలో నేర్చుకుంటే వింతే కదా? ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని ప్రముఖ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) విద్యార్థులు ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
వర్సిటీ సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ కౌషల్ కిశోర్ మిశ్రా.. విద్యార్థులకు ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. విద్యార్థులకు పిడకలపై పాఠాలు చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో మిశ్రా చుట్టూ పలువురు విద్యార్థులు కూర్చుని, పిడకలు చేసే విధానాన్ని తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత బీహెచ్‌యూ వర్సిటీ సైతం దీనిపై ట్వీట్ చేసింది. వర్సిటీ ప్రాంగణంలోని ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవలప్మెంట్ సెంటర్లో వర్క్‌షాప్ నిర్వహించినట్లు పలు ఫొటోలను షేర్ చేసింది.
" ఈ పిడకలను పూజలు, హోమం వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఆహారం వండేందుకు ఇంధనంగా వాడతారు. ఆవు పేడతో చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. అది రైతుల ఆదాయం పెరిగేందుకు దోహదపడుతుంది. విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి పిడకలు ఎలా చేయాలో వివరిస్తారు."