కరోనా టీకాల కోసం కొత్తగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్ల నమోదుకు అనుమతించొద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం శనివారం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ విభాగం కింద అనర్హులైన కొందరు వ్యక్తుల పేర్లు వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన జాబితాలో నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం లేఖ రాశారు. ఈ జాబితా కింద కొన్ని రోజులుగా ఉన్న డేటాబేస్లో అనూహ్యంగా 24శాతం పెరుగుదల కనిపించిందని ఆయన వెల్లడించారు.