Third Wave In India: దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు సగటున 7,500 చొప్పున నమోదవుతున్నాయని జాతీయ కొవిడ్-19 సూపర్‌మోడల్ కమిటీ తెలిపింది. అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేసింది. థర్డ్ వేవ్ వచ్చినా.. దాని తీవ్రత సెకండ్ వేవ్ కంటే స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది.
"వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా.. అది సెకండ్ వేవ్ కంటే స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే దేశంలో చాలామంది టీకా కారణంగా రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నారు. కచ్చితంగా థర్డ్ వేవ్ ఉంటుంది. ప్రస్తుతం సగటున 7,500 కేసులు నమోదవుతున్నాయి. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలంగా మారిన తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుతాయి."
-విద్యాసాగర్, జాతీయ కొవిడ్-19 సూపర్‌మోడల్ కమిటీ హెడ్
Corona daily cases: "సెకండ్ వేవ్ కంటే థర్డ్‌వేవ్‌లో రోజువారీ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతాయి. సాధారణ పౌరులకు టీకాలను వేయడాన్ని ప్రభుత్వం మార్చి 1 నుంచి ప్రారంభించింది. అది డెల్టా వేరియంట్ విజృంభణ ప్రారంభమైన సమయం. ఆ సమయంలో ఫ్రంట్ లైన్ కార్మికులు కాకుండా వ్యాక్సిన్ తీసుకోనివారే... కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యారు"అని విద్యాసాగర్ పేర్కొన్నారు. గతానుభవం దృష్ట్యా.. వైరస్‌ను ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యాలను పెంచుకున్నామని తెలిపారు.