Covid Review Meeting Today :కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్-1పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరగడానికి కొవిడ్-19 ఉపరకం జేఎన్.1 కారణమని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ సూచించారు. పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు.
ఇటీవల అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్రం వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కేంద్రం కోరింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని అధికారులకు సూచించింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మే 21 తర్వాత దేశంలో నమోదైన రోజువారీ కొవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,311 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అయితే జేఎన్-1 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి కొవిడ్ ఉపరకం జేఎన్-1 ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని ప్రకటించింది. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది. ఐతే జేఎన్-1 వల్ల కొవిడ్ కేసులు పెరుగుతాయని WHO హెచ్చరించింది. BA.2.86 అనే కొవిడ్ ఉపరకం నుంచి వచ్చిందే జేఎన్-1. అమెరికా, చైనా, సింగపూర్, భారత్ వంటి దేశాల్లో జేఎన్-1 కేసులు వెలుగు చూశాయి. పలుదేశాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలకు ఇది కారణమైంది. సింగపూర్‌లో ఒక్కసారిగా కొవిడ్ కేసులు 75 శాతం పెరిగాయి. వీటిలో ఎక్కువగా జేఎన్-1 కేసులేనని గుర్తించారు.