తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్‌ ఎఫెక్ట్‌: పరీక్షలు లేకుండా పై తరగతులకు..

కరోనా 2.0 ఉధృతమవుతున్నందువల్ల చాలా రాష్ట్రాలు పాఠశాలల్ని మూసివేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడం వల్ల అవి లేకుండానే.. విద్యార్థులను పై తరగతులకు పంపించాలని నిర్ణయం తీసుకున్నాయి.

STUDENTS
విద్యార్థులు

By

Published : Apr 15, 2021, 8:04 PM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు పాఠశాలలను మూసి వేశాయి. మరోవైపు విద్యా సంవత్సరం ముగింపునకు రావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపాలని పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. పంజాబ్‌, హరియాణా, ఒడిశా రాష్ట్రాలు పరీక్షల రద్దు లేదా వాయిదాకు సిద్ధపడుతున్నాయి.

పంజాబ్‌లో నేరుగా పై తరగతులకే!

నిత్యం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే 5, 8, 10 తరగతుల విద్యార్థులను పై తరగతులకు పంపనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ సమీక్షా సమావేశం నిర్వహించాక ఈ నిర్ణయం తీసుకున్నారు. 10వ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఏప్రిల్‌ 30 వరకూ అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లు సీఎం అమరీందర్‌ ప్రకటించారు. 5వ తరగతి విద్యార్థులు ఐదింటిలో ఇప్పటికే 4 సబ్జెక్ట్‌ల పరీక్షలు రాసేశారు. ఇక 8, 10 తరగతుల విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రీ-బోర్డ్‌ ఎగ్జామ్స్‌, ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా నిర్ణయిస్తారు.

అదే బాటలో ఒడిశా, హరియాణా

ఒడిశా, హరియాణ రాష్ట్రాలు కూడా పంజాబ్‌ బాటలోనే పయనిస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. 10వ తరగతి పరీక్షల రద్దుతో పాటు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హరియాణా ప్రభుత్వం తెలిపింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో 15 వరకు మూసివేత

కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మే 15 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక 10, 12 తరగతుల బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను కూడా మే 20 వరకు వాయిదా వేశారు. మరోవైపు కరోనా నియంత్రణలో భాగంగా 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:టీకా ఉత్సవ్​: 3 రాష్ట్రాల్లో కోటి మందికి టీకాలు

ABOUT THE AUTHOR

...view details