Covid 19 Virus In Human Body: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న తరుణంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ ఒక్కసారి సోకితే అది నెలలపాటు ఒంట్లోనే ఉండి వివిధ శరీర భాగాలపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేపట్టారు. కాగా కరోనా సోకినప్పటినుంచి ఏకంగా 230 రోజులపాటు (ఏడున్నర నెలలు) వైరస్ మానవ శరీరంలో ఉంటున్నట్లు గుర్తించారు. శరీరంలోని పలు అవయవాలు సహా మెదడులోనూ దీన్ని గుర్తించినట్లు వెల్లడించారు. లక్షణం లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్నవారిలోనూ అదే స్థాయిలో వైరస్ ఉన్నట్లు పేర్కొన్నారు.
Covid 19 Virus Stays In Body for Months: వైరస్ అత్యధికంగా శ్వాసకోశంలో (97.7 శాతం) గుర్తించినట్లు అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత గుండె రక్తనాళ కణజాలం, లింఫోయిడ్, జీర్ణశయాంతర కణజాలాలు, మూత్రపిండం, ఎండోక్రైన్ కణజాలంలో గుర్తించినట్లు తెలిపింది. పునరుత్పత్తి కణజాలం, కండరాలు, చర్మం, కొవ్వులోనూ వైరస్ ఉండటాన్ని కనుగొన్నట్లు వివరించింది. మెదడు కణజాలంలోనూ ఏడు నెలలపాటు ఉంటోందని పేర్కొంది. పలు అవయవాలపై దాడి చేస్తోందని చెప్పిన శాస్త్రవేత్తలు.. ఊపిరితిత్తులపై మాత్రం ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించలేదని చెప్పారు. కొవిడ్ సోకి మృతిచెందిన 44 మంది మృతదేహాలపై రోజులపాటు పరీక్షలు నిర్వహించారు.