కష్టకాలంలో వ్యవసాయ రంగమే దేశానికి ఆశారేఖగా నిలిచిందని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. కరోనా కారణంగా ఎదురైన ఆర్థిక సవాళ్లను తట్టుకొనేలా చేయగలిగింది ఈ ఒక్క రంగమేనని నవంబరు మాస ఆర్థిక సమీక్ష పత్రంలో అభిప్రాయపడింది. ‘‘
ఈ ఆర్థిక సంవత్సరంలో మహమ్మారి కారణంగా పారిశ్రామిక, సేవా రంగాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. వ్యవసాయ రంగం మాత్రం రెండు త్రైమాసికాల్లో 3.4% మేర వృద్ధిరేటు నమోదు చేసింది. ఇదొక్కటే దేశ స్థూల ఉత్పత్తికి అదనపు విలువను జోడించింది. దీన్నిబట్టి చూస్తే దేశంలో ఖరీఫ్ కోతలు, రబీ విత్తన కార్యక్రమాన్ని కొవిడ్ ఏమాత్రం ప్రభావితం చేయలేదని స్పష్టమవుతోంది. ఖరీఫ్ దిగుబడి అద్భుతంగా ఉంటుందని అంచనా వేస్తున్నందున 2020-21 వ్యవసాయ సంవత్సరంలో ఆహార ధాన్యాల దిగుబడి లక్ష్యం 301 మిలియన్ టన్నులను మించే అవకాశముంది. ఇది గతేడాది కంటే 1.5% అధికం. ప్రస్తుతం రబీ విత్తన కార్యక్రమం ఆరోగ్యకరంగా సాగుతుండటం... వ్యవసాయ రంగం బలంగా ముందుకు వెళ్తోందనడానికి సంకేతం.
మద్దతు ధరలు పెరిగాయి