పండగల సమయంలో కొవిడ్ జాగ్రత్తలు (Covid Festive Season) పాటించకపోవడం వల్ల పలు రాష్ట్రాల్లోనూ; ప్రపంచంలోని వివిధ విదేశాల్లోనూ కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం హెచ్చరించింది. ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, మున్ముందు పండగ వేళల్లో కట్టుదిట్టమైన చర్యలు (Covid Festive Season) తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం రాష్ట్రాలకు లేఖ రాశారు. రాబోయే పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కంటెయిన్‌మెంట్ జోన్లు, ఐదు శాతానికి మించి కొవిడ్ కేసులున్న జిల్లాల్లో భారీ జనసమూహాలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
పండుగల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ స్థానిక పాలనా యంత్రాంగాలు చాలా ముందుగానే ఉత్తర్వులు జారీచేయాలని పేర్కొన్నారు. పండుగల వేళ నిర్వహించే కార్యక్రమాల్లో పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించాలని, ప్రతిచోటా ప్రజలు కొవిడ్ ప్రవర్తనతో మెలిగేలా చూడాలన్నారు. అన్నిచోట్లా నిఘా ఉంచి, అవసరమైతే తగిన శిక్ష విధించేలా చర్యలు అవసరమన్నారు. షాపింగ్ మాళ్లు, మార్కెట్లు, ప్రార్థనా స్థలాల్లో పాటించాల్సిన ప్రమాణాల గురించి గత ఏడాది నవంబరు 30న జారీచేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. పండుగలను ఆన్‌లైన్‌లో చేసుకునే వినూత్న విధానాలను ప్రోత్సహించాలన్నారు.