Covaxin for Children: జనవరి 3 నుంచి పిల్లలకు(15-18 ఏళ్లు) కొవిడ్ టీకా ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉందని ఆరోగ్య శాఖకు చెందిన అధికార వర్గాలు పేర్కొన్నాయి.
"ప్రస్తుతం 15-18 ఏళ్ల వారికి ఇచ్చేందుకు.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది పిల్లలు ఈ ప్రక్రియ ద్వారా లబ్ధి పొందనున్నారు."
--అధికార వర్గాలు.
అనుమతి పొందినా..
ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకొవ్-డి కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆగస్టు 20నే అనుమతి లభించింది. 12-18 ఏళ్ల వారికి ఇచ్చేందుకు ఈ టీకాను తయారు చేసినప్పటికీ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాలేదు.