Kerala Human Sacrifice Case: కేరళలోని పథనంతిట్ట జిల్లా ఎలంతూర్‌లో చోటుచేసుకున్న నరబలి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంచలనంగా మారిన ఈ కేసులో వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రధాన నిందితుడైన మాంత్రికుడు రషీద్.. తర్వాతి లక్ష్యం.. లైలా భర్త భగవల్ సింగ్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భగవల్ సింగ్‌ను హతమార్చి లైలాతో కలిసి జీవించేందుకు మాంత్రికుడు రషీద్ పన్నాగం పన్ని ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం ముగ్గురు నిందితులను 12 రోజుల పోలీసు కస్టడీకి స్థానిక కోర్టు అప్పగించింది. పోలీసులు వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టి విచారణ చేయనున్నారు. నరబలి వెనుక మరే ఇతర కారణాలు ఉండి ఉంటాయా అనే దానిపై పోలీసులు విచారణ జరపనున్నారు. నిందితులు హతమార్చిన ఇద్దరు మహిళల బంగారు ఆభరణాలు కూడా కనిపించడం లేదు. నిందితులు వాటిని విక్రయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాల సేకరణ కోసం పథనంతిట్ట, ఎర్రాకులం జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లాల్సి ఉందని కస్టడీ పిటిషన్‌లో పోలీసులు కోర్టును కోరారు.
కేరళలో ఇద్దరు మహిళలను హతమార్చడంతో పాటు వారి శరీర భాగాలను వండుకుతిన్నారన్న ఎలంతూర్ ఘటన.. కేరళతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో మాంత్రికుడు రషీద్ మొదటి నిందితుడు కాగా.. భగవల్ సింగ్ రెండో నిందితుడిగానూ, అతడి భార్య లైలా మూడో నిందితురాలిగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 52 ఏళ్ల పద్మ, 50 ఏళ్ల రోస్లిన్‌ను... రషీద్ ఎలంతూర్‌లో భగవల్ సింగ్ దంపతుల నివాసానికి తీసుకువచ్చి.. సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. రషీద్ సూచనల మేరకు పద్మను 5 ఖండాలుగా, రోస్లిన్‌ను 56 ముక్కలుగా చేసినట్లు తెలిసింది. ఆ శరీరభాగాల్లో కొన్నింటిని వండుకుని ముగ్గురూ తిన్నట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్స్ సాయంతో నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరికొంత మందిని నరబలి ఇవ్వాలని నిందితులు యోచిస్తున్నట్లు వారి విచారణలో వెల్లడైంది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని మాంత్రికుడు రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ అనే వ్యక్తి చెప్పిన మాటలతో ఈ నేరం చేసిన తీరును భగవల్ సింగ్-లైలా దంపతులు పోలీసులకు వివరించారు.