Couple Murder in Yadiki: నిద్రిస్తున్న దంపతులను హత్య చేసిన ఉన్మాది.. హంతకుడ్ని రాళ్లతో కొట్టి చంపిన స్థానికులు - నిట్టూరులో హత్య
Published : Sep 16, 2023, 6:18 AM IST
|Updated : Sep 16, 2023, 7:01 AM IST
06:09 September 16
దంపతుల పక్కనే నిద్రిస్తున్న కుమార్తెను చంపేందుకు యత్నం
Couple Murder in Yadiki Anantapur District: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న దంపతులను ఓ ఉన్మాది నరికి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దంపతుల హత్యతో ఆగకుండా ఆ క్రూరుడు.. పక్కనే నిద్రిస్తున్న వారి కుమార్తెను హత్య చేయటానికి ప్రయత్నించాడు. హత్య అలికిడితో అప్రమత్తమైన ఆ బాలిక.. గట్టిగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు మేల్కొని ఉన్మాదిని పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని యాడికి మండలం నిట్టూరులో సోమ్మక్క, బాలరాజు దంపతులు.. శుక్రవారం రాత్రి సమయంలో వారి ఇంటి ముందు నిద్రపోయారు. ఈ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి.. నిద్రిస్తున్న దంపతులపై దారుణంగా దాడి చేసి, హత్య చేశాడు. వారి పక్కనే నిద్రిస్తున్న కుమార్తెను సైతం హత్య చేయటానికి పూనుకున్నాడు. కానీ, ఆమె అక్కడి నుంచి తప్పించుకుని కేకలు వేసింది. అరుపులు విన్న స్థానికులు మేల్కొని.. అక్కడికి చేరుకుని హత్యకు దిగిన వ్యక్తిని పట్టుకున్నారు. ఈ క్రమంలో ఉన్మాది పారిపోయే ప్రయత్నం చేయడంతో.. అతడిపై స్థానికులు రాళ్లతో దాడి చేయగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హంతకుడు ప్రసాద్‌కు మతిస్థిమితం లేదని, ఈ కారణంతోనే అకారణంగా దంపతులను హత్య చేశాడనే వాదన వినిపిస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.