దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో కరోనా వైరస్ మహమ్మారికి భయపడొద్దని.. అది కేవలం స్వల్ప ఇన్‌ఫెక్షన్ మాత్రమేనని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో 85 నుంచి 90శాతం రోగులు లక్షణాలకు అనుగుణంగా ఇంటివద్దే చికిత్స తీసుకుంటే సరిపోతుందని సూచించారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్, ఇతర ఔషధాలను ఇళ్లలో నిల్వచేసుకోవడం అనవసర భయాలు సృష్టిస్తాయని.. అంతేకాకుండా ఈ చర్యల వల్ల మార్కెట్‌లోనూ వీటి కొరత ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
భయాలు వద్దు..
"కొవిడ్-19 కేవలం స్వల్ప ఇన్‌ఫెక్షన్ మాత్రమే. 85 నుంచి 90 శాతం మంది ప్రజలు జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. వీటికి ఇంటివద్దే చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ అవసరం లేదు "
-- డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
కేవలం 10 నుంచి 15శాతం రోగులకు మాత్రమే ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ లేదా ప్లాస్మా అవసరం అవుతుందన్నారు. 5శాతానికి తక్కువ మందికి మాత్రమే వెంటిలేటర్ లేదా ఐసీయూ చికిత్స ఇవ్వాల్సి వస్తోందని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. అనవసర భయాలకు లోనుకాకుండా ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ వంటి ఔషధాలను ఇళ్లలో నిల్వచేసుకోవద్దని స్పష్టం చేశారు. వీటి వల్ల భయాలు కలగడమే కాకుండా మార్కెట్‌లో ఔషధాలకు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు.