Corona Update: దేశంలో కరోనా గణనీయంగా తగ్గుముఖం పడుతోందని కేంద్రం వెల్లడించింది. ఇదివరకుతో పోలిస్తే పరిస్థితి మెరుగైందని.. ప్రపంచవ్యాప్తంగా ఊహించిన సమయం కంటే ముందే కేసులు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. జనవరి 24న దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని.. ఇప్పుడు 4.44 శాతానికి చేరిందని తెలిపింది. భారత్‌లో కరోనా స్థితిపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించింది. మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా వైరస్‌పై పూర్తి అవగాహన లేనందున అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ఆ రాష్ట్రాల్లో తప్ప..
కొవిడ్ వ్యాప్తి కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనకరంగానే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 40కు పైగా జిల్లాల్లో ఇంకా వీక్లీ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోందని పేర్కొంది. ప్రస్తుతం 141 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని.. 5-10 శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 160గా ఉందని వెల్లడించింది.