Corona Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,108 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 31 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,675 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,10,057
- మరణాలు: 5,28,216
- యాక్టివ్ కేసులు: 45,749
- రికవరీలు: 4,39,36,092
Vaccination In India :
దేశంలో మంగళవారం 19,25,881 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 215.67 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,55,231 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 4,49,966 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,310 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,47,08,266 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,20,447 మంది మరణించారు. మరో 6,79,774 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,36,97,662కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 64,694 కేసులు వెలుగుచూశాయి. మరో 157 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో కొత్తగా 57,309 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 51,299 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 109 మంది మృతి చెందారు.
- తైవాన్‌లో 47,051 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో 44,045 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 101 మంది మృతి చెందారు.
1.70 కోట్ల మందిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు!
కరోనా వ్యాప్తి మొదటి రెండేళ్లలో ఐరోపా సమాఖ్య దేశాల్లో దాదాపు 1.70 కోట్ల మంది దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాల (అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర)తో బాధపడినట్లు తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఈ సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. డబ్ల్యూహెచ్‌ఓ కోసం 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్, ఎవల్యూషన్' అనే సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. 2020, 2021ల్లో ఈయూ దేశాల్లో కరోనా సోకిన కొందరిలో కనీసం మూడు నెలలపాటు లాంగ్ కొవిడ్ లక్షణాలు కొనసాగాయని నివేదికలో పేర్కొంది. యూరప్, మధ్య ఆసియా ప్రాంతాల్లో లక్షలాది మంది దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలతో బాధపడినట్లు డబ్ల్యూహెచ్‌వో యూరప్ రీజినల్ డైరెక్టర్ హెన్రీ క్లూగే సైతం ధ్రువీకరించారు.
లాంగ్ కొవిడ్ లక్షణాల బారిన పడే అవకాశం పురుషుల కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉందని నివేదిక సూచిస్తోంది. ఒక్కోసారి ఆసుపత్రిలో చేరేంతగా పరిస్థితులు దిగజారే అవకాశం ఉందని పేర్కొంది. ముగ్గురు మహిళల్లో ఒకరు, ఐదుగురు పురుషుల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘కొవిడ్‌తో ఎంత మంది ప్రభావితమయ్యారు? ఎంతకాలం ఆరోగ్య వ్యవస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? తదితర అంశాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. అయితే, ఈ గణాంకాలు కేవలం అంచనాలేనని.. లాంగ్ కొవిడ్‌పై రూపొందించిన ఇతర అధ్యయనాల వివరాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించినట్లు వెల్లడించారు.