Ram Temple Construction:ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 2023 డిసెంబర్‌లోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. సుల్తాన్‌పుర్‌లో రక్షా బంధన్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల్లోనే పెద్ద ఆలయంలో రామ్ లల్లాను దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు.
'అయోధ్యకు సుల్తాన్‌పుర్ సమీపంలోనే ఉన్నందున.. వచ్చే ఏడాది డిసెంబర్లో శ్రీరామ్ లల్లాను దర్శించుకోవాలని మీకు ఆహ్వానం పలుకుతున్నా' అని సుల్తాన్‌పుర్ ప్రజలకు చెప్పారు రాయ్. ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని అన్నారు. ఆలయ నిర్మాణంలో ఇనుము వాడట్లేదని.. అయితే ఆలయ డిజైన్ చూసి ప్రజలు ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. రామ మందిరం నిర్మాణ పనుల్ని చూసుకునేందుకు.. కేంద్రం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను నియమించింది. వచ్చే ఏడాది చివరి నాటికి గుడిని పూర్తి చేయాలని ట్రస్ట్ గడువు పెట్టుకుంది.