Congress Survey In Parliament Constituencies :వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందుకోసమే ఇండియా కూటమిలో సీట్ల పంపకానికి ముందే దేశవ్యాప్తంగా 500 లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే చేపట్టాలని భావిస్తోంది. దీనికోసం ఏఐసీసీ ఓ పరిశీలకుల కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ పరిశీలకులు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సర్వే చేసి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదికను సమర్పిస్తారని తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే క్లస్టర్ ఇంఛార్జ్‌లను నియమించిన తర్వాత ఈ పరిశీలకుల నియామకం జరుగుతందని సమాచారం. అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో పరిశీలకులు, క్లస్టర్ ఇంఛార్జ్‌ల సహాయాన్ని తీసుకోవచ్చు. అయితే సీట్ల పంపకంపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల 'ఇండియా కూటమి ప్యానెల్' సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సర్వే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
"ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ ప్రస్తుతం ఇండియా కూటమి సీట్ల పంపకం చర్చలు సరైన దిశలో సాగుతున్నాయి. ఈ నెలలోనే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా, దిల్లీ, గుజరాత్, కర్ణాటక, బిహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షాల ఓటు శాతం 63. కానీ అప్పుడు విపక్షాలు ఐక్యంగా లేవు. ఈసారి జేడీయూ, శివసేన వంటి కీలక మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. విపక్షాల ఓట్లు ఏకమైతే 2024 ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి"
--ఆశిశ్ దువా, ఏఐసీసీ మహారాష్ట్ర ఇంఛార్జ్ కార్యదర్శి