దేశంలో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ సంక్షోభం అంచున నిలిచింది. అసంతృప్తులు, జీ23 బృందంగా వార్తల్లోకెక్కిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం.. అధిష్ఠానికి తలనొప్పిగా మారింది. బహిరంగంగా విమర్శించడం, పార్టీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా నడుచుకోవడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో చీలిక వస్తుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అంతర్గత సమస్యలను సీనియర్ నేతలు రచ్చకీడ్చడం వల్ల.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై అనూహ్య ప్రభావం చూపుతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి:కాంగ్రెస్ స్థైర్యంపై మరో దెబ్బ.. కోలుకుంటుందా?
జీ23 బృందంలోని ఎనిమిది మంది నేతలు ఇటీవలే జమ్ము కశ్మీర్లో పర్యటించారు. గాంధీ గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన బహిరంగ సభకు వీరు హాజరయ్యారు. చాలా కాలం నుంచి పార్టీలో ఉన్న అసంతృప్తి ఈ సమావేశంతో మరోసారి బయటపడినట్లైంది. ఏడాది తర్వాత సొంత రాష్ట్రానికి వచ్చిన గులాం నబీ ఆజాద్‌కు ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. కానీ, ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రస్తావనే రాలేదు. అందుకు భిన్నంగా.. అసంతృప్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగుడుతూ కనిపించారు. ఇక్కడికి వచ్చిన వారు ధరించిన 'కాషాయ' తలపాగాలు.. రాజకీయ పండితులతో పాటు సాధారణ ప్రజానీకంలోనూ అనుమానాలకు కారణమవుతున్నాయి.
ఇదీ చదవండి:కాంగ్రెస్‌లో జీ23 గుబులు- చీలిక ఖాయమా?
భాజపా ఎదురుగాలితో దేశవ్యాప్తంగా బలహీనపడిన కాంగ్రెస్.. ఈ సమస్యను మరింత జఠిలం చేయాలని అనుకోవడం లేదు. జమ్ము కశ్మీర్ సభకు హాజరైన నేతలను వివరణ కోరడం, వారిపై చర్యలు తీసుకోవడం వంటివి చేస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్ఠానం భావిస్తోంది. బహిరంగంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా.. పార్టీకి అవమానకరంగా ఉంటుందని అధినాయకత్వం జాగ్రత్తపడుతోంది.
మరిన్ని సమావేశాలు
అయితే, అసంతృప్తుల ప్రత్యేక సమావేశాలు ముగిసిపోయినట్లు కనిపించడం లేదు. జమ్ము కశ్మీర్ తరహా సమావేశం హరియాణాలోనూ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కురుక్షేత్ర జిల్లాలో ఓ ర్యాలీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమావేశం ఎందుకోసం నిర్వహిస్తున్నారు? అజెండా ఏంటి? ఏ బ్యానర్‌తో జరుపుతున్నారనే విషయాలపై స్పష్టత రాలేదు. పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం మాని, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టిపెట్టాలని ఇతర సీనియర్ నేతలు హితవు పలుకుతున్న వేళ.. జీ23 నేతలు తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు. తమకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదని అంటున్నారు.
"కార్యక్రమం తర్వాత పార్టీ మమ్మల్ని సంప్రదించలేదు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరపున పనిచేయాలని మాకు సలహా ఇస్తున్నారు. కానీ మాకు ఏ బాధ్యతా అప్పగించలేదు. ఇప్పటివరకు మమ్మల్ని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించలేదు. ఒకవేళ ప్రచారానికి వెళ్లాలని అనుకుంటే.. ఖర్చులను అభ్యర్థే భరించాల్సి ఉంటుంది. పార్టీని బలోపేతం చేసేందుకు మేం మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాం. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తాం."
-జీ23 నేతల్లో ఒకరు
ట్విట్టర్ వార్
జమ్ము కశ్మీర్ పర్యటనపై అధిష్ఠానం సానుకూలంగానే స్పందించినా.. ఆ తర్వాత నేతల మధ్య జరుగుతున్న పరిణామాలు సంక్షోభంలో ఉన్న పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. పార్టీ నిర్ణయాలను అసంతృప్త నేతలు ప్రశ్నించడంపై మాటల యుద్ధం మొదలైంది.
బంగాల్ ఎన్నికల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్త నేతల్లో ఒకరైన ఆనంద్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ-నెహ్రూ భావజాలమైన లౌకికవాదానికి ఈ నిర్ణయం వ్యతిరేకమని అన్నారు. ఈ సమస్యను వర్కింగ్ కమిటీ ద్వారా పరిష్కరించాలని సూచించారు. అంతేకాక, బంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మతతత్వ శక్తులతో పోరాడేటప్పుడు కాంగ్రెస్ ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరించకూడదు. మతం, రంగుతో సంబంధం లేకుండా అన్ని రకాలుగా పోరాడాలి. దీన్ని బంగాల్ పీసీసీ అధ్యక్షుడు ప్రోత్సహించడం బాధాకరం, సిగ్గుచేటు. ఆయన వివరణ ఇవ్వాల్సిందే." అంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:కొరవడిన నాయకత్వం... బలహీనమవుతున్న హస్తం పార్టీ..!