Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కొద్ది వారాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 'భారత్ జోడో యాత్ర'పై పార్టీ దృష్టి పెట్టడంతో పాటు, కొన్ని రాష్ట్రాల పార్టీ విభాగాలు అవసరమైన ప్రక్రియను ఇంకా పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఆదివారం.. పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక మరింత లేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నూతన అధ్యక్ష ఎన్నిక ఈ ఏడాది ఆగస్టు 21- సెప్టెంబరు 20 మధ్య జరుగుతుందని గత ఏడాది అక్టోబరులో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాగా ఎన్నిక ప్రక్రియ కొంత ఆలస్యం కావొచ్చని, అక్టోబరు నాటికి పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ పదవిని చేపట్టేందుకు ఒకవైపు అగ్రనేత రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు పండగల ముందు ఇది సరైన కాలం కాదని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వైద్య పరీక్షల నిమిత్తం కాంగ్రెస్ ప్రస్తుత అధినేత్రి సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. తర్వాత ఇటలీ వెళ్తారు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతోన్న తన తల్లిని పరామర్శించనున్నారు. ఈ మొత్తం పర్యటనలో సోనియా వెంట రాహుల్, ప్రియాంక గాంధీ ఉంటారు. దీంతో పార్టీ కార్యకలాపాలు, ఎన్నిక గురించి చర్చించేందుకు సీడబ్ల్యూసీగా వర్చువల్‌గా సమావేశం కానుంది.