Congress Manifesto In Madhya Pradesh :మధ్యప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. మహిళలకు నెలకు రూ.1500 రూపాయల ఆర్థిక భరోసా కల్పిస్తామని పేర్కొంది. అలాగే రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్ అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ మేనిఫెస్టోను మంగళవారం భోపాల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వింటా ధాన్యాన్ని రూ. 2500కు కొనుగోలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అలాగే క్వింటా గోధుమలను రూ. 2600కు కొనుగోలు చేస్తామని పేర్కొంది. రాష్ట్ర పౌరులకు 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. అలాగే రాష్ట్రంలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించింది. అలాగే రాష్ట్రం తరఫున ఐపీఎల్ జట్టు ఏర్పాటు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చింది.
రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు సహా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా 59 వాగ్దానాలతో 106 పేజీల మేనిఫెస్టోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత పింఛను పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే పాఠశాల విద్యను విద్యార్థులకు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. యువతకు రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి నెలకు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు అందజేస్తామని హామీ ఇచ్చారు.