తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ మాజీ ఎంపీ కేవీపీ కీలక వ్యాఖ్యలు.. జగన్​కు దూరంపై వివరణ..!

Congress EX MP KVP Ramachandra Rao: వైఎస్సార్​ సన్నిహితుడు, కాంగ్రెస్​ సీనియర్​ నేత కేవీపీ రామచంద్రరావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్​కి దగ్గరగా ఉన్న తాను.. జగన్​కి దూరంగా ఎందుకు ఉంటున్నారన్న దానిపై వివరణ ఇచ్చారు.

Congress EX MP KVP Ramachandra Rao
Congress EX MP KVP Ramachandra Rao

By

Published : Apr 1, 2023, 12:48 PM IST

Congress EX MP KVP Ramachandra Rao: దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డికి దగ్గరగా ఉన్న తాను.. జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేనన్న ఆయన.. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు. మరో రోజు మీడియా సమావేశం పెట్టి అన్ని వివరిస్తానని తెలిపారు.

రాహుల్​ అంశంపై ప్రతి ఒక్కరూ స్పందించారు.. ఒక్క ఏపీ మినహా: బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుందో తనకు కారణం తెలీదన్నారు. ప్రత్యేక పరిస్థితులని చెప్పిన తానే.. ఆ ప్రత్యేక పరిస్థితులేంటో తెలియదని చెబుతున్నానని రామచంద్రరావు అన్నారు. రాహుల్​కు జరిగిన అన్యాయంపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అంతా స్పందించారని.. ఒక్క ఏపీ మినహా అంటూ విమర్శించారు. ఏపీ నుంచి 25 మంది లోక్​సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు , 175 మంది శాసనసభ్యులు ఉన్నారని.. కానీ ఒక్కరూ కూడా అన్యాయం అని కనీసం స్పందించలేదని విమర్శించారు.

దేశం క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు స్పందించక పోతే ఎలా: ఇక జాతీయ నాయకుడి స్థాయిలో ఉన్న చంద్రబాబు ఇక్కడి విషయాలపైనే మాట్లాడి స్థాయి తగ్గించుకుంటే ఎలా అని కేవీపీ నిలదీశారు. మహానాడులో మోదీ అరాచకాలపై తీర్మానం పెట్టీ ఉంటే అంగీకరించే వాళ్లమని కేవీపీ రామచంద్రరావు అన్నారు. స్పెషల్ ప్యాకేజీలతో ఏపీకి బీజేపీ మరణ శాసనం రాసిందని, దానిని చంద్రబాబు అంగీకరించారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం చేపట్టాల్సి ఉంటే.. తామే కట్టుకుంటామని చంద్రబాబు చెప్పారన్నారు.

ఎన్డీఏ కన్వీనర్​గా పని చేసిన చంద్రబాబు ఇక్కడి స్థానిక రాజకీయాలకే పరిమితం అవుతారా అన్న ఆయన.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్పందించక పోతే ఎలా అని ప్రశ్నించారు. 2019లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తును తాను వ్యతిరేకించినట్లు గుర్తుచేశారు. దిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో కాంగ్రెస్ అగ్ర నేతలు అంతా వచ్చి పాల్గొన్నారన్నారు. మరి ఇప్పుడు వారికి మద్దతు పలకాల్సిన అవసరం ఆయనకు లేదా అని నిలదీశారు. రాహుల్ గాంధీ గురించి చంద్రబాబు పోరాడితే ఆయన వెనుక నడుస్తానని కేవీపీ తెలిపారు. ప్రశ్నించటం గురించి పుట్టిన పార్టీ జనసేన కూడా బీజేపీతో స్నేహం వల్ల ప్రశ్నించక పోవచ్చని.. కనీసం జరిగింది తప్పు అని అంతర్గతంగా అయినా మాట్లాడుకోవచ్చని తెలిపారు.

మోదీల గురించి మాట్లాడితే.. బీసీలు ఎక్కడి నుంచి వచ్చారు: కుంటి సాకులతో రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి, ఆయన ఉంటున్న ఇంటి నుంచి బయటకు నెట్టేశారని మండిపడ్డారు. దీనిపై అంతా ప్రశ్నించక పోతే దమనకాండ ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. మోదీల గురించి మాట్లాడితే మధ్యలో బీసీలు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ అనర్హతపై రాష్ట్రపతి సంతకం చేశారా.. కనీసం సాటి ఎంపీలకు అయినా తెలిసిందా అని నిలదీశారు. కోర్టు ఉత్తర్వులు వెలువడక ముందే లోక్​సభ నుంచి బయటకు పంపుతారా అంటూ మండిపడ్డారు. రాహుల్​కు దిల్లీలో ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదన్నారు. ఓ దేశ భక్తుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి జరిగిన అవమానాన్ని ప్రజలు చూస్తూ ఉరుకోకూడదన్నారు.

అదానీ సంపద గురించి రాహుల్​ ప్రశ్నిస్తే.. దేశద్రోహమా: హిండెన్​బర్గ్​ నివేదిక బయటపడకపోతే అదానీ సంపద.. అక్రమ మార్గాల్లో పెరుగుతూ పోయేదేనని కాంగ్రెస్​ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. 2019 వరకూ అప్పుల్లో ఉన్న అదానీ సంపద.. ఒక్కసారిగా ఎలా పెరిగిందని ప్రశ్నించారు. అదానీ సంపద పెరిగితే.. భారతదేశం అప్పులు పెరిగాయని ఆరోపించారు. అదానీ సంపద గురించి సీనియర్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే.. దేశ ద్రోహమా అంటూ నిలదీశారు. మనం కట్టే కరెంటు బిల్లులులో ప్రతీ పైసాలో.. కొంత మొత్తం అదానీకి వెళ్లేలా ఒప్పందాలు జరిగాయని రామచంద్రరావు ఆరోపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details