APCC President Sharmila: జగనన్న వదిలిన బాణాన్నిఅంటూ చెప్పుకొన్న షర్మిల, నేడు ఆయన వైపే దూసుకొస్తోంది. కాంగ్రెస్‌కు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె నియమితులయ్యారు. ఏపీలో 2019లో జగన్ అధికార పీఠమెక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తరవాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని అక్కడే కొనసాగారు. అయినా కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, తెలంగాణ రోడ్లతో పోలుస్తూ అప్పటి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పటి నుంచే ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఉంటూ ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై స్పందించిన ఆమె, ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావడం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ఢీ కొట్టనున్నారు. SC, ST, క్రిస్టియన్ వర్గాలు తమ కంచుకోటగా భావించే వైసీపీ ఓటు బ్యాంకుపైనా షర్మిల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పునర్‌నిర్మించి పూర్వవైభవం తీసుకొస్తానని, షర్మిల ఇటీవల దిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసినప్పుడు చెప్పారు. దీంతో వైసీపీని ఎదుర్కోవడానికి ఆమె దీటైన వ్యక్తి అని భావించి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజుతో రాజీనామాచేయించింది. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిలనుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. షర్మిల భర్త క్రైస్తవ మత ప్రబోధకుడు కావడంతో ఆ ప్రభావం క్రైస్తవుల ఓట్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వర్గాన్ని ఇప్పటివరకు తమ పూర్తిస్థాయి ఓటు బ్యాంకుగా వైసీపీ భావిస్తోంది. క్రైస్తవుల్లో మంచి ఆదరణ ఉన్న అనిల్ వల్ల అధికార పార్టీకి ఇబ్బందికరమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.