పెట్రో ధరలు జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన నేపథ్యంలో మోదీ సర్కారుపై కాంగ్రెస్ విరుచుకుపడింది. పెంచిన పెట్రో ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది.
"గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) ధరల పెంపులో మోదీ సర్కార్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. ద్రవ్యోల్బణంతో ప్రజలు బాధపడుతుంటే మోదీ సర్కార్ మాత్రం పన్ను వసూళ్లలో బిజీగా ఉంది"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు
మునుప్పెన్నడూ లేనంతగా లీటర్ పెట్రోల్(దిల్లీలో) రూ. 85.70, లీటర్ డీజిల్, రూ.75.88కు పెరగడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్.. కేంద్రాన్ని విమర్శించారు.
"దిగ్భ్రాంతికి గురి చేసే విషయం ఒకటి ఉంది. 2014లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయేటప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 108 డాలర్లు ఉంది. అప్పుడు భారత్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.51, డీజిల్ ధర రూ. 57.28 ఉంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అప్పటితో పోల్చితే ఇప్పుడు సగానికి తగ్గింది. కానీ భారత్లో మాత్రం లీటర్, పెట్రోల్, డీజిల్ ధర 85.70, 75.88కి పెరిగింది."
-అజయ్ మాకెన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
'ఆ డబ్బంతా ఎటుపోయింది?'
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల ఆరున్నరేళ్లలో ప్రభుత్వానికి అదనంగా రూ.20 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు మాకెన్. "మరి అంత డబ్బు ఎక్కడ ఉంది? ప్రధాని మోదీ మిత్రులైన పెట్టుబడిదారుల జేబుల్లోకి వెళ్లిందా" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదీ చూడండి:'కాంగ్రెస్ గెలిస్తే చొరబాటుదార్లకు గేట్లు తెరిచినట్లే'