పెగసస్ స్పైవేర్(pegasus spyware india) ఆరోపణలపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తోన్న కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గూఢచర్యానికే జేమ్స్ బాండ్ అని పేర్కొన్నారు. ఇప్పుడు.. తప్పుడు, కల్పిత అంశంపై పార్లమెంట్ సమయాన్ని వృథా చేయాలనుకుంటోందని దయ్యబట్టారు. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు యథావిధిగా నడిచేందుకు సహకరిస్తే.. ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుందని పేర్కొన్నారు.
పీటీఐ వార్తా సంస్థ ముఖాముఖిలో మరిన్ని ప్రశ్నలకు నఖ్వీ ఇలా జవాబు ఇచ్చారు...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కుదించనున్నారా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిస్తారనే వార్తలు నిజమైనవి కాదు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు పార్లమెంట్ కార్యకలాపాలు కొనసాగుతాయి.
పార్లమెంట్లో ప్రతిష్టంభనను తొలగించేందుకు మరో మార్గమేదైనా అనుసరిస్తారా?
కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని విపక్ష పార్టీలు ఆరోపణలు చేయటం, అక్కడి నుంచి జారుకోవటం అనే విధానంతో పని చేస్తున్నాయి. వారికి ప్రజల సమస్యలపై చర్చలో పాల్గొనటం ఇష్టం లేదు. కరోనాపై చర్చించాలని కోరుకుంటున్నట్లు ముందుగా చెప్పారు. దానిని పక్కన పెట్టారు. రైతుల సమస్యలపై మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పి, దానికీ అంగీకరించటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానిపై చర్చించేందుకు ఎలాంటి ఆసక్తి చూపటం లేదు.
పెగసస్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టటంపై మీరేమంటారు?
ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు, కల్పితమైన అంశంపై మాట్లాడి పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా చేయాలని వాళ్లు కోరుకుంటున్నారు. పెగసస్ వెలుగులోకి వచ్చిన వెంటనే సమయం వృథా చేయకుండా ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వనున్నాం. కానీ, ఈ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించటానికిి బదులుగా గందరగోళం సృష్టిస్తున్నారు. హింసాత్మక ధోరణి అవలంబిస్తున్నారు.
విపక్ష సభ్యుల్లో చాలా వరకు చర్చలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారు. కానీ, కాంగ్రెస్ వారికి స్వీయ నియమిత అధినేతగా వ్యవహరిస్తోంది. తన వ్యతిరేక భావజాలాన్ని విపక్షాలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. రఫేల్ జెట్స్ అంశంపైనా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా చేస్తోంది.
యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గూఢచర్యానికే జేమ్స్ బాండ్లు. ప్రతిపక్షంలోకి రాగానే నిఘా వ్యవస్థపై ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. వారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన నేతనే గూఢచర్యంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. (రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన కల్పిత సూపర్ స్పై పాత్రను సూచిస్తూ ఈ ఆరోపణలు చేశారు నఖ్వీ. ఆయన నవల ఆధారంగా సినిమాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.)
చర్చలు లేకుండానే బిల్లుల ఆమోదంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి? దానిపై ఏమంటారు?
పార్లమెంట్లో ఆందోళనలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు యూపీఏ ఎన్ని బిల్లులు ఆమోదింపజేసుకుందో.. ఓసారి చరిత్రను పరిశీలించుకోవాలి. వారి హయాంలో కామన్వెల్త్, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాలపై పార్లమెంట్లో ఆందోళనలు చేశారు. కానీ, ఇప్పుడు వారికి ఎలాంటి సమస్యలు లేవు. చర్చల్లో పాల్గొనాలని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నాం. చర్చించాల్సిన అంశాలపై నోటీసులు ఇవ్వొచ్చు. స్పీకర్, ఛైర్మన్ నిర్ణయం తీసుకుని వారికి సమయం కేటాయిస్తారు.
ఇదీ చూడండి:ఈ నెల 5న పెగసస్ వ్యవహారంపై సుప్రీం విచారణ
'పెగసస్' దుర్వినియోగంపై చర్యలు- ఆ దేశాలపై నిషేధం!