ఏడాది కాలంగా కరోనాతో యుద్ధం చేస్తున్నాడు మనిషి. ఈ చావుబతుకల పోరాటంలో కొందరు సాటివారికి అండగా ఉంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నాచితక పని చేసుకునే వ్యక్తులైనప్పటికీ.. ఎవరికి తోచిన మేరకు వారు సాయం అందిస్తున్న అలాంటి వ్యక్తులపై ప్రత్యేక కథనం ఇది.
కర్ణాటక హుబ్బళ్లికి చెందిన ఇర్షాద్ బల్లాషేత్ అనే వ్యక్తి కరోనా రోగులకు ఉచిత అంబులెన్స్ సేవలందిస్తూ సేవ చేస్తున్నారు. వ్యాధి బారిన పడిన వారికి సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం తనను కలచివేసిందని చెబుతున్నారు.
హుబ్బళ్లిలోని గణేశపేటలో నివసించే ఇర్షాద్ బల్లాషేత్.. స్వయంగా అంబులెన్స్ నడుపుతూ కరోనా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్తారు. కొవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకువెళుతుంటారు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న ఇర్షాద్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.
వీడియోకాలూ ఒక సేవే..
గుజరాత్లో ఎన్నడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నవ్సారి జిల్లా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఇక్కడికి వచ్చేవారిలో చాలామంది నిరుపేదలే. స్మార్ట్‌ఫోన్ సదుపాయం లేని వీరు.. ఆసుపత్రిలో చేరిన తమవారి బాగోగులు తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేయాల్సిందే.
ఇక తమ కుటుంబ సభ్యులతో మాట్లాడలేని రోగులు సైతం మానసికంగా నిరాశకు గురవుతుంటారు. ఈ సమస్యను గమనించిన కొందరు యువ వలంటీర్లు కొవిడ్ రోగులతో వారి కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేయిస్తూ.. సేవకు కాదేదీ అనర్హం అని చాటుతున్నారు. పీపీఈ కిట్లు ధరించి కొవిడ్ రోగులను సందర్శిస్తూ గ్రామాల్లో ఉన్న తమవారికి వీడియో కాల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు.
నీటిపై తేలియాడే అంబులెన్స్..