Cockfights and Gambling in Full Swing in Andhra Pradesh:సంక్రాంతి వేళ రెండోరోజూ కోడిపందేలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. కోడి పందేల బరుల పక్కనే జూద క్రీడలు జరుగుతున్నా, పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీ నేతల అండతో, బెట్టింగ్ రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలు, జూదం, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే కోడి పందేలు, పొట్టేలు పోటీలు సాగుతున్నాయి. కోడి పందేల మాటున కోట్ల రూపాయల బెట్టింగ్ సాగుతోంది. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక శిబిరాలు పెట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలు చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో పోలీసులు పట్టించుకోలేదు.
చంద్రన్న సంక్రాంతి సంబరాలు - అంబరాన్నంటేలా మహిళా కబడ్డీ పోటీలు
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పందేలు కాస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు ఇలాఖా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పందేం రాయుళ్లు భారీగా బరులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జూదం, గుండాట ఆడుతున్నారు. అధికారులు అటు కన్నెత్తయినా చూడకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లలోని పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, అమరావతి మండలంలోని ఉంగుటూరులో భారీగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు.