Coal Levy Money Laundering Case : ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) మంగళవారం సోదాలు జరిపింది. బొగ్గు లెవీ మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవేందర్ యాదవ్, చంద్రదేవ్ ప్రసాద్ రాయ్, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్, ఐఏఎస్ అధికారి రాను సాహు, వ్యాపారి సూర్యకాంత్ తివారీ తదితరులకు చెందిన రూ.51.4 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అందులో స్థిరాస్తులు, విలాసవంతమైన వాహనాలు, నగదు,ఆభరణాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఈడీ అధికారులు అధికారికంగా తెలిపారు.
ఈడీ అధికారులు జప్తు చేసిన కారు దర్యాప్తు సమయంలో బొగ్గు వ్యాపారి సూర్యకాంత్ తివారీకి ఆర్థిక సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇళ్లపై దాడులు చేశామని ఈడీ అధికారులు పేర్కొన్నారు. పీఎంఎల్ఏ చట్టం కింద రూ.51.4 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని తెలిపారు. కొన్నాళ్ల క్రితం ఈ కేసులో ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్, బ్యూరోక్రాట్ సౌమ్య చౌరాసియా నుంచి మొత్తం రూ.170 కోట్ల ఆస్తులను ED జప్తు చేసింది. దీంతో బొగ్గు లెవీ కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటివరకు 221.5 కోట్లు జప్తు చేసినట్లైంది. ఇదే కేసులో ఈ ఏడాది జనవరిలో ఓ ఐఏఎస్ అధికారి నివాసం సహా వివిధ ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేసింది. అప్పటి తనిఖీల్లో 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్ నివాసంలో రూ.47 లక్షల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు.
ఈడీ అధికారులు జప్తు చేసిన ఆభరణాలు మద్యం స్కామ్ సంచలనం
ఇటీవల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం సైతం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం ద్వారా నిందితులు సుమారు రూ. 2 వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ స్కామ్ వెనుక రాయ్‌పుర్ మేయర్ ఏజాజ్ దేభర్ సోదరుడు అన్వర్ దేభర్ ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో అమ్ముడయ్యే ప్రతి మద్యం సీసా నుంచి అన్వర్ చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేసినట్లు ఈడీ ఆరోపించింది. ఈ మేరకు అన్వర్ దేభర్‌ను పీఎంఎల్ఏ కింద శనివారం అర్ధరాత్రి ఈడీ అరెస్టు చేసింది.
ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థ ఈడీపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సోమవారం విమర్శులు గుప్పించారు. ఈడీని బీజేపీ ఏజెంట్‌గా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఈడీ ఆరోపణలను భూపేశ్ బఘేల్ కొట్టిపారేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుత్సాహానికి గురైన బీజేపీ ఈడీని ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల నివాసాలపై ఈడీ బొగ్గు లెవీ కేసులో దాడులు జరపడం గమనార్హం.
రవాణా చేసిన ప్రతి టన్ను బొగ్గుపై.. ఛత్తీస్‌గఢ్‌లోని పలువురు సీనియర్ అధికారులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు.. రూ.25 అక్రమ పన్ను వసూలు చేశారని ఈడీ ఆరోపించింది. బొగ్గు లెవీ కుంభకోణం రూపంలో గత 2ఏళ్లలో రూ.450 కోట్ల భారీ దోపిడీ కుట్ర జరిగిందన్న ఐటీ శాఖ ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తోంది.