Yogi Adityanath Temple : నిలువెత్తు విగ్రహం.. కాషాయ దుస్తులతో అలంకరణ.. చేతిలో బాణం.. తల చుట్టూ కాంతి వలయం.. రోజుకు రెండు సార్లు పూజలు, ప్రసాదాలు.. సాధారణంగా ఏ దేవుడి గుడిలోనైనా కనిపించే దృశ్యాలే ఇవి. కానీ.. ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్య జిల్లా భరత్కుండ్లోని ఆలయం మాత్రం ప్రత్యేకం. ఈ గుడిలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిమనే దేవుడి రూపంలో ప్రతిష్టించి, నిత్య పూజలు చేయడం విశేషం.
అయోధ్యలోని రామ జన్మభూమికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది భరత్‌కుండ్. వనవాసానికి వెళ్లే ముందు.. రాముడికి ఇక్కడే భరతుడు వీడ్కోలు పలికాడని చెబుతుంటారు. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తికి యోగి ఆదిత్యనాథ్ అంటే అమితమైన అభిమానం. అందుకే ఆయన కోసం ఫైజాబాద్-ప్రయాగ్‌రాజ్ హైవే పక్కన గుడి కట్టేశాడు.
"రాముడి కోసం గుడి కడుతున్న యోగి కోసం మేము ఆలయం నిర్మించాం. ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారా దేవుడి స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఆయనకు గుడి కట్టాలన్న ఆలోచన వచ్చింది." అని చెప్పాడు ప్రభాకర్ మౌర్య. శ్రీరాముడికి చేసినట్టే.. రోజుకు రెండుసార్లు ఆదిత్యనాథ్ విగ్రహం ముందు కీర్తనలు పాడుతున్నాడు ప్రభాకర్. పూజల తర్వాత 'భక్తులకు' ప్రసాదం పంచి పెడుతున్నాడు.