CM Shivraj Singh Chouhan MP Assembly Election 2023 :మధ్యప్రదేశ్‌లో 'మామా' మేజిక్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ ఆయన నేతృత్వంలోని బీజేపీ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు నెలకొంటుందనుకున్నా ఆయన మాస్టర్ ప్లాన్‌ను పర్ఫెక్ట్గా అమలు చేసి భారతీయ జనతా పార్టీ- బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా 'మామా'తో ప్రజలకు అనుబంధాన్ని ఛేదించలేకపోయాయి. ఆ 'మామా' మరెవరో కాదు 2003 నుంచి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న (డిసెంబర్ 2018-మార్చి 2020 వరకు 15 నెలల మినహా) శివరాజ్ సింగ్ చౌహాన్.
'మామా' రాయకీయ భవిష్యత్‌పై నీలినీడలు..
మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్‌ను అందరూ ముద్దుగా 'మామా' పిలుస్తారు. తాజాగా ఈయన దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విశ్లేషణలను.. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలతో పటాపంచలు చేశారు. అయితే 'మామా' ఇక్కడి వరకు రావడానికి చిన్నపాటి యుద్ధమే చేశారనడంలో సందేహం లేదు.
ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సుదీర్ఘ కాలంపాటు సేవలందించారు. రాజకీయంగా అపార అనుభవం ఉంది. ఇలాంటి నేతను దాదాపు పక్కనే పెట్టినంత పని చేసింది బీజేపీ అధిష్ఠానం! మామా పేరును తొలి రెండు అభ్యర్థుల జాబితాల్లో ప్రకటించలేదు. దీని కారణంగా ఆయన ముఖ్యమంత్రి రేసులో లేరని ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయనను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచనున్నారనే వార్తలు సైతం వచ్చాయి. దీంతో సొతం పార్టీ అపనమ్మకంతో శివరాజ్ సింగ్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ప్రజలు ఆయనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారు.
మహిళా సాధికారతకు పెద్ద పీట..
అయితే పరిస్థితులు అన్నీ కట్టగట్టుకుని దాడి చేసినా 'మామా' ధైర్యం కోల్పోలేదు. తనకు ప్రజల్లో ఉన్న నమ్మకాన్నే పెట్టుబడిగా చేసుకుని ముందుకు కదిలారు. తాను చేసిన అభివృద్ధి- పేద, బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలే అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లారు. పీఎం ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి రూ.450కే సిలిండర్ అందించారు. దీని ద్వారా లబ్ధి పొందిన దాదాపు 1.3 కోట్ల మంది మహిళలను తాను చేసిన సంక్షేమాన్ని గుర్తించాల్సిందిగా అభ్యర్థించారు. 15 లక్షల మంది మహిళలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ, ఆడపిల్లలకు యుక్తవయస్సు వచ్చే వరకు ఆర్థిక సాయం, లాడ్లీ బెహ్నా, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెంపు వంటి హామీలతో తాము ప్రభుత్వంలోకి వస్తే ఆడపిల్లలకు, మహిళల కోసం పాటుపడతానని హామీ ఇచ్చి వారు మనసులను గెలుచుకున్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమం అందేలా..
దాదాపు 30 లక్షల జూనియర్ లెవెల్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచడం, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు, 78,000 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్స్, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా క్వింటా గోధుమలను రూ.2,700, ధాన్యాన్ని రూ. 3,100 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు, వచ్చే ఐదేళ్లపాటు పేదలందరికీ ఉచిత రేషన్, కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ కల్యాణ్ యోజన కింద ప్రతి రైతుకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, ముఖ్యమంత్రి జన్ ఆవాస్ యోజన, పేద ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం వంటి హామీలతో భవిష్యత్తులో కూడా తమ వెంట ఉంటాననే నమ్మకం ప్రజలకు కలిగించారు.