CM KCR Speech at Patancheru Public Meeting : సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు.
CM KCR Comments on AP and TS Lands : పటాన్‌చెరు రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. పటాన్‌చెరులో మహిపాల్‌రెడ్డి బాగా పని చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. గతంలో పటాన్‌చెరులో కరెంట్ కోసం సమ్మెలు చేసే వారన్న ముఖ్యమంత్రి.. పటాన్‌చెరులోని పరిశ్రమల్లో ఇవాళ 3 షిఫ్టులు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రావడంలో రాజీవ్‌శర్మ కృషి ఉందన్న కేసీఆర్... హరీశ్‌రావు వచ్చాక వైద్యరంగం పరుగులు పెడుతోందన్నారు.
'పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో రైలు వస్తుంది. వచ్చే ఐదేళ్లలో పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ మెట్రో వస్తుంది. పటాన్‌చెరులో కాలనీలు బాగా పెరుగుతున్నాయి. పటాన్‌చెరులో ఐటీ కంపెనీలు వచ్చేలా ప్రయత్నిస్తాం. రామసముద్రం చెరువును త్వరలోనే సుందరీకరణ చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీకి రూ.30 కోట్లు ఇస్తాం. ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లు ఇస్తాం. పటాన్‌చెరులో కాలుష్యం పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ నలువైపులా 5 పెద్ద ఆస్పత్రులు వస్తున్నాయి.'-సీఎం కేసీఆర్